వైసిపి కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కూటమి పాలన అన్యాయంగా సాగుతోందని, ఆధారాలు లేని కేసులు పెట్టి వైసిపి నాయకులను వేధిస్తున్నారని వైసిపి కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి నాయకులపై పెట్టిన కేసుల్లో ఎక్కడా ఆధారాలు లేవని, కేసులు పెట్టడం కోసం ఫిర్యాదులు సృష్టిస్తున్నారని తెలిపారు. కేసులు పెట్టిన పోలీసులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు తీసుకోవడం లేదని, వాటిపైనా కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తామని అన్నారు. అధికార పార్టీ సోషల్ మీడియాలో అన్యాయంగా విమర్శలు చేస్తుంటే కనీసం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్షం వాళ్లు పోస్టు పెడితే వెంటాడి మరీ కేసులు పెడుతున్నారని అన్నారు. డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి పిఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్టుతో ఉద్యోగుల్లో తీవ్ర భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారితే ఇప్పుడు కేసులు పెట్టిన పోలీసులు, వారిని ప్రోత్సహించిన వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. రాజధాని విషయంలో ఎంతవరకు అవసరమో అంత వరకే కట్టుకుంటే సరిపోతుందని, అనవసరంగా అప్పులు చేసి వాటిని మరలా ప్రజల నుండి వసూలు చేసే పనిపెట్టుకుంటే ఇప్పటికే అల్లాడుతున్న ప్రజలు మరీ ఇబ్బందుల్లో పడతారని తెలిపారు. గతంలో తాము అప్పులు తీసుకొస్తే కేంద్రానికి లేఖలు రాసిన టిడిపి నాయకులు, ఇప్పుడు అదనపు గనులు, ఆదాయాలు ఉన్నాయనే పేరుతో ఎపిఎండిసిని తాకట్టు పెట్టే పనిచేస్తున్నారని, ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని అన్నారు.
