ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సోషల్ మీడియాలో పోస్టింగ్‌ల పేరుతో వైసిపి కార్యకర్తలను వేధించడం తప్ప ప్రజలకు టిడిపి కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులోని వైసిపి కార్యాలయంలో గురువారం మహాత్మ జ్యోతిరావుఫూలే 134 వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు సోషల్ మీడియా కేసులను తెరపైకి తెచ్చారన్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధించడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న టిడిపి నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో వైసిపి ప్రభుత్వం పేదలకు ప్రాథమిక విద్యను దగ్గర చేస్తే టిడిపి కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తోందని తెలిపారు. తల్లికి వందనం పథకాన్ని అటకెక్కించారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించారని తెలిపారు.