బైండోవర్‌ కేసులతో వేధింపులు

  • ఆపకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం
  • ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సిపిఎం

ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులపై అధికారుల వేధింపులు ఇలాగే కొనసాగితే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు హెచ్చరించారు. గుంటూరు జిలా తాడేపల్లిలో ఎసిసి సిమెంట్‌ ఫ్యాక్టరీ భూముల్లో కార్మికుల భూ పోరాటం కొనసాగింది. మూడో రోజు మంగళవారం కూడా కార్మికులు కర్రలతో ఇళ్ల నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ స్థలంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన సమావేశంలో పాశం రామారావు మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌ఐ ముక్కామల అప్పారావు ఫిర్యాదు మేరకు సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులు, యూనియన్‌ నాయకులు కూరపాటి స్టీవెన్‌, ఎస్‌కె భాష, వై సుబ్బారావు, సూర్య ప్రకాష్‌, వెంకటరత్నం, ఆశీర్వాదం తదితరులను పోలీసులు తీసుకెళ్లి తహశీల్దార్‌ కార్యాలయంలో బైండోవర్‌ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులను ధిక్కరించిన వారిపై కేసులు నమోదు చేసి శిక్షించాల్సిన పోలీసులు, తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలు అడిగిన కార్మికులపై కేసులు నమోదు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్‌ జోక్యం చేసుకొని సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఉత్పన్నమయ్యే సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫ్యాక్టరీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. న్యాయమైన ఈ పోరాటానికి అన్ని ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతును కూడగడతామని అన్నారు. ఎసిసి సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుల పోరాటానికి సిపిఎం నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, బూరుగ వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు వేముల దుర్గారావు, ఎఐఎఫ్‌టియు నాయకులు కోటేశ్వరరావు తమ సంపూర్ణ మద్దతు తెలిపి మాట్లాడారు.

➡️