డయేరియా విస్తరించకుండా చర్యలు : వైద్యారోగ్యశాఖ కమిషనరు ఎస్‌ వెంకటేశ్వర్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో డయేరియా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లాల డిఎంహెచ్‌ఒలను వైద్యారోగ్యశాఖ కమిషనరు ఎస్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో చోటుచేసుకున్న డయేరియా సంఘటనలు మరే ఇతర నగరాల్లోనూ పునరావృతం కాకూడదని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌్‌లోని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డిఎంహెచ్‌ఒలు, జిల్లాల మలేరియా ఆఫీసర్స్‌ (డిఎంఒ)లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో డయేరియా ప్రబలడంలో సిఎంహెచ్‌ఒల వైఫల్యం కనబడుతోందన్నారు. డిఎంహెచ్‌ఒలతో సిఎంహెచ్‌ఒలు సమన్వయం చేసుకుంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు. డయేరియా విషయంలో మున్సిపల్‌ కమిషనర్లతో తాను స్వయంగా మాట్లాడుతానని వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో నీటి శ్యాంపిళ్ల పరీక్ష కోసం ఐపిఎమ్‌తో సమన్వయం చేసుకోవాలని, ఐపిఎమ్‌ల వద్ద ఉన్న నాలుగు మొబైల్‌ వాహనాలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అల్లూరి సీతారామరాజు, పల్నాడు, శ్రీకాకుళం జిల్లాల్లో నీటి శ్యాంపిల్స్‌ను పరీక్షించే విషయంతోపాటు, తిరుపతి, కర్నూలు, విశాఖ నగరాల్లో మలేరియా, డెంగీ కేసుల విషయంలో సిహెచ్‌ఒలు మరింత శ్రద్ధ కనబరచాలన్నారు.
యుపిహెచ్‌సిల (అర్బన్‌ పబ్లిక్‌ సెంటర్స్‌) వారీ కేసుల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. కీటక జనిత వ్యాధులపై భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర స్థాయి అధికారులను కమిషనరు ఆదేశించారు. దోమల నివారణ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున సీజనల్‌ వ్యాధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గిరిజన సంక్షేమ స్కూళ్లు, హాస్టల్స్‌పై దృష్టి సారించాలన్నారు. సికిల్‌సెల్‌ ఎనీమిమా స్క్రీనింగ్‌పై దృష్టిపెట్టాలన్నారు. ఈ సమీక్షలో ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ పద్మావతి, అడిషనల్‌ డైరెక్టర్‌ అనిల్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ఎమ్‌ స్టేట్‌ ప్రోగ్రామ్‌ మేనేజరు దుంపల వెంకట రవికిరణ్‌ పాల్గొన్నారు.

➡️