‘అచ్చెన్న’ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Apr 19,2024 00:53 #Atchannaidu, #TDP

ప్రజాశక్తి-అమరావతి : ఎపి స్కిల్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ నిధుల మళ్లింపు అభియోగాలతో సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మే 8కి వాయిదా పడింది. ఈ మేరకు జస్టిస్‌ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు పత్రాలు సమర్పించేందుకు గడువు కావాలని సిఐడి కోర డంతో విచారణ వాయిదా వేశారు. ఈలోగా పిటిషనరును అరెస్టు చేయడం లేదా ఇతర కఠిన చర్యలు తీసుకోరాదన్న గత ఉత్తర్వులను పొడిగించారు.
దస్తగిరి పిటిషన్‌పై విచారణ 23కి వాయిదా
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను హంతకుడిగా అభివర్ణిస్తూ టివిల్లో కథనాలు ప్రసారం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. ఈ నెల 8న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని దస్తగిరి వాదన. కేసు విచారణ పూర్తయ్యే వరకు టివిల్లో కథనాలు రాకుండా చేయాలని కోరారు. పిటిషనరు వినతిపత్రంపై చర్యలు ఏం తీసుకున్నదీ వివరించేందుకు గడువు కావాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. దీంతో విచారణ 23కు వాయిదా పడింది.

➡️