కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

తెలంగాణ : ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ … కేటీఆర్‌ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తొలుత ఈ కేసును విచారించిన జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ ధర్మాసనం ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ ను అరెస్టు చేయవద్దని, అయితే విచారణ కొనసాగించవచ్చని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌కు నోటీసులు జారీ చేసింది. తమది రెగ్యులర్‌ బెంచ్‌ కానందున, తదుపరి విచారణ రెగ్యులర్‌ రోస్టర్‌తో కూడిన బెంచ్‌ ముందు జాబితా చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన విచారణపై ఏసీబీ అధికారులు కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మున్సిపల్‌ శాఖ కార్యదర్శి దానకిషోర్‌ కూడా కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దానకిషోర్‌ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్న దఅష్ట్యా ఏ1 కేటీఆర్‌, ఏ2 అరవింద్‌ కుమార్‌, ఏ3 బీఎల్‌ఎన్‌ రెడ్డిలకు ఏసీబీ ఇంకా నోటీసులు జారీ చేయలేదని సమాచారం. అయితే వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అధికారులు సిద్ధం చేశారు.

➡️