తీరాన్ని తాకిన ‘ఫెంగల్‌’ తుపాన్‌.. ఏపీకి భారీ వర్ష సూచన

ప్రజాశక్తి-విశాఖ : నైరుతి బంగాళాఖాతంలోని ‘ఫెంగల్‌’తుపాన్‌ పూర్తిగా తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఫెంగల్‌’తుపాన్‌ పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇవాళ, రేపు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

➡️