అనంతపురం, కర్నూలులో భారీ వర్షం

  • పిడుగుపాటుకు ఇద్దరు మృతి
  • ఉప్పొంగిన వాగులు, వంకలు

ప్రజాశక్తి – యంత్రాంగం : ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ భారీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 77.6, కర్నూలు జిల్లా తుగ్గలిలో 56.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి రహదారులు జలపాతాన్ని తలపించాయి. పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
వర్షానికి కర్నూలు జిల్లా తుగ్గలి చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మామిళ్లకుంట రోడ్డు తెగిపోవడంతో తుగ్గలి- మామిళ్లకుంటకు రాకపోకలు నిలిచిపోయాయి. మామిళ్ల కుంట గ్రామస్తులు చుట్టూ తిరిగి పత్తికొండ, ఎద్దులదొడ్డి, కోతి కొండమీదుగా చేరుకుంటున్నారు. హాలహర్వి మండలంలోని ఎస్‌సి కాలనీ పక్కన పెద్దవాగు పొంగి పొర్లడంతో పలు ఇళ్లలోని వరద నీరు వచ్చి చేరింది. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో ఇస్కాల గ్రామ సమీపంలో ఉన్న బనవాసి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని తురకల పట్నం నుంచి సానిపల్లికి వెళ్లే రహదారిలో వంకలు భారీగా ప్రవహిస్తున్నాయి. బత్తలపల్లి మండలంలో చిన్న కుంటలు, చెక్‌ డ్యాముల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. డి. చెర్లోపల్లిలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం యర్రంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాదెండ్ల రవీంద్రబాబు (30) తన పశువుల కోసం పొలం నుంచి మేత తీసుకువస్తుండగా ఆయనకు సమీపంలో పిడుగుపడింది. దీంతో రవీంద్రబాబు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. రవీంద్రబాబుకు భార్య కళావతి, కుమార్తె ప్రభావతి ఉన్నారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం చలంకూరు గ్రామానికి చెందిన గంధం థామస్‌ (55) ఇంటి ముందున్న చెట్టుపై పిడుగుపడింది. ఆ సమయంలో చెట్టు కింద కూర్చున్న థామస్‌ అక్కడికక్కడే మరణించారు. మూడు గేదెలు మృత్యువాతపడ్డాయి.

➡️