హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన

May 17,2024 08:46 #Heavy rain, #hydrabad
  • భారీగా ట్రాఫిక్‌ జామ్‌
  • కొట్టుకుపోయిన వాహనాలు
  • పిడుగుపాటుకు నలుగురు మృతి

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. గురువారం సాయంత్రం గంటపాటు కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. పలు చోట్ల నాలాలు, మ్యాన్‌ హోల్స్‌ పొంగి పొర్లాయి. పలు ప్రాంతాల్లో మోకాలులోతు నీరు చేరడంతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆర్‌టిసి క్రాస్‌రోడ్‌లోని స్టీల్‌ బ్రిడ్జితోపాటు పంజాగుట్ట, బేగంపేట వద్ద రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్‌ డివిజన్‌లోని ఉదయనగర్‌ కాలనీలో నాలా స్లాబ్‌ కొట్టుకుపోయింది. వరద ఉధృతికి అదే ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో దిల్‌సుఖ్‌నగర్‌ కోఠి మార్గంలో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. కల్వకురి, రాజన్న సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని భరత్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి గ్రామాల్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు.

➡️