- 4 రోజుల పాటు మోస్తరు వాన
ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఐఎండి తెలిపింది. ఆవర్తన ప్రభావంతో బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రాజమహేం ద్రవరం, రాజమహేంద్రవరం రూరల్‌లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి మోకాల్లోతు నీరు చేరింది. రాజమహేంద్రవరం హైటెక్ బస్టాండ్ వద్ద, మెయిన్ రైల్వేస్టేషన్ రహదారిలో భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దేవరపల్లి, పెరవలి, ఉండ్రాజవరం, గోపాలపురం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు గంటకుపైగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఏలూరులో పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్‌ఆర్‌పేట, శ్రీనివాస థియేటర్ రోడ్డు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముదినేపల్లి, కలిదండి, కుక్కునూరు తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. విజయవాడలో మోస్తరు వర్షం పడింది.
పిడుగుపాటుకు ఒకరు మృతి
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అంబడిపూడి గ్రామానికి చెందిన రైతు కూనిశెట్టి నారాయణ (35) తన పొలంలో పనిచేసేం దుకు వెళ్లారు. వర్షం కురుస్తుం డడంతో ఇంటికి బయలుదేరారు. దారి మధ్యలో అతనికి సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.