నెల్లూరు, ప్రకాశంలో భారీ వర్షాలు

  • జలమయమైన రహదారులు
  • తిరుమలలో విరిగిపడిన చెట్లు, కొండచరియలు

ప్రజాశక్తి-యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం, బాపట్ల, కృష్ణా, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని పలుచోట్ల బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా సముద్ర తీరం వెంబడి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వాన నీరు నిలిచిపోయింది. రాకపోకలకు జనం ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కృష్ణా జిల్లాల్లో కోత కోసిన వరి ధాన్యం తడిచిపోయింది. ప్రకాశం జిల్లా శింగరాయకొండలో అత్యధికంగా 70.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రంలో అలల తీవ్రత కారణంగా మత్స్యకారులు వేటను నిలిపేశారు. సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని టిపి నగర్‌ అప్పాపురంలో వర్షానికి గిరిజనుల ఇళ్లల్లోకి నీరు చేరింది. చీరాలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దండుబాట రోడ్డులోని లోతట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇళ్ల చుట్టూ వర్షపు నీరు చేరి అక్కడ చెరువులను తలపించాయి. సుమారు రెండు గంటలపాటు వర్షం ఏకధాటిగా కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో కురిసిన భారీ వర్షానికి కోత కోసిన వరి ధాన్యం తడిచిపోయాయి. కొంతమంది రైతులు పరదాలతో ధాన్య బస్తాలపై కప్పి జాగ్రత్త పడ్డారు. వేమవరం ప్రధాన రహదారిపై వడ్ల రాశులు, సంచులతో నింపిన ధాన్యం బస్తాలు వర్షానికి తడిచిపోయాయి. దీంతో, రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో భారీ వర్షం కురిసింది. నగరంలోని ఎన్‌టిఆర్‌ నగర్‌, జనార్ధన్‌రెడ్డి కాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. అండర్‌ బ్రిడ్జిల కింద నీరు చేరింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు వర్షపు నీరు ప్రవహిస్తుడడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై, చిరుజల్లులు పడుతున్నాయి. తిరుమల కొండపై భక్తులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం వేకువజామున కురిసిన వర్షానికి తిరుమల రెండవ ఘాట్‌ రోడ్లో కొండ రాళ్లు, చెట్లు విరిగిపడ్డాయి. రోడ్డుకు అడ్డంగా విరిగి పడిన రాళ్లను టిటిడి ఫారెస్ట్‌, విజిలెన్స్‌ సిబ్బంది తొలగించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేశారు. ఘాట్‌ రోడ్డులో యాత్రికుల భక్తులు టిటిడి సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

➡️