అమరావతి : దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. రేపటి నుంచి ఏపీ, తెలంగాణలోకి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు పడవచ్చు. నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్ కడప, నంద్యాల, పశ్చిమ గోదావరి, పల్నాడు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు , ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక తెలంగాణలో నవంబర్ 16 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. నవంబర్ 17 నుంచి మాత్రం తెలంగాణలో ఎలాంటి వర్షసూచన లేదు. హైదరాబాద్‌లో రాత్రి పూట చలి పెరగనుంది. ఆకాశం మేఘావృతంగా ఉండవచ్చు.
