చలో సంక్రాంతి

  • సొంతూళ్లుకు జనం బారులు
  • టోల్‌గేట్ల వద్ద రద్దీ
  • బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిట
  • అవసరమైతే ప్రైవేటు స్కూళ్ల బస్సులు : సిఎం ఆదేశం

ప్రజాశక్తి – యంత్రాంగం : సంక్రాంతి పండగకు నగర ప్రజానీకం సొంతూళ్లకు కదులుతోంది. దీంతో నగరాలు, పట్టణాల్లోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడు తున్నాయి. హైదరాబాద్‌తో పాటు విజయవాడ లోనూ ఇదే పరిస్థితి కనపడుతోంది. అదనంగా ప్రత్యేక రైళ్లు, బస్సులు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా అవి ఏమాత్రం చాలని పరిస్థితి నెలకొంది. దీంతో శనివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై స్పందించారు. ఆర్‌టిసి బస్సులు చాలకపోతే ఫిట్‌నెస్‌ బాగా ఉన్న ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల బస్సులను కూడా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆర్‌టిసి ఎమ్‌డి కూడా డిపో మేనేజర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు శనివారం ఉదయం నుండే హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరగడం ప్రారంభమైంది. టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి. ఎన్‌టిఆర్‌ జిల్లా కీసర, చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద తీవ్రమైన రద్దీ ఏర్పడింది. కీసర టోల్‌ఫ్లాజా సిబ్బంది మొత్తం 7 లైన్లు ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌లు సరిగా పనిచేయకపోవటంతో ఒక్కో వాహనం ముందుకు పోవడానికి 5 నుంచి 10 నిమిషాలు సమయం పడుతోంది. దీంతో కీసర టోల్‌ఫ్లాజా వద్ద వాహనాలు కిలోమీటరు మేర బారులు తీరాయి. నందిగామ వై జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వంతెన నిర్మాణం, అనుబంధ సర్వీస్‌ రోడ్డు నిర్మాణం కారణంగా రద్దీ పెరిగింది. తెలంగాణాలోని అబ్దులాపూర్‌మెట్‌ ఒఆర్‌ఆర్‌ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్‌ పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు.

➡️