మిర్చి రైతులను ఆదుకోండి : ఎపి రైతు సంఘం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిర్చి పంటకు క్వింటాలుకు రూ.25 వేలకు తక్కువ లేకుండా ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. మిర్చి పంటను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్చి రైతుల ప్రయోజనాలను కాపాడాలని పేర్కొంది. ఈ మేరకు ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు మిర్చి పంట విస్తారంగా సాగు చేస్తున్నారని, రాయలసీమ, పల్నాడు, గుంటూరు, ఎన్‌టిఆర్‌, రంపచోడవరం, ఉత్తరాంధ్ర దాదాపు అన్ని జిల్లాల్లో మిర్చి పంటసాగు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది మిర్చి పంట సాగు విస్తీర్ణం సుమారు లక్ష ఎకరాలకు తగ్గిందన్నారు. 2004-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 4 లక్షల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారని, ఈ పంటకు నల్లతామర, ఎమిని వైరస్‌ వంటి తెగుళ్లు వచ్చి దిగుబడి తగ్గిందన్నారు. విత్తనం మొదలు పంట కోత వరకు ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతర పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగి ఎకరాకు రెండున్నర లక్షలకు పైగానే పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందన్నారు. పంట దిగుబడి తగ్గిపోవడం, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, మార్కెట్లో ధరలు కూడా పడిపోవడంతో మిర్చి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. 2023 డిసెంబరులో క్వింటాలు రూ.23 వేల నుంచి రూ.26 వేల వరకు ధర పలికిందని, ఇప్పుడు రూ.9 వేల నుంచి రూ.12 వేల మధ్యలో ధర పలుకుతోందన్నారు. ఈ ఏడాది పండిన పంటను నిల్వ చేసేందుకు గిడ్డంగుల్లో సరిపడా స్థలం కూడా లేదన్నారు. ఈ పరిస్థితుల్లో క్వింటాలుకు కనీసం రూ.25 వేలు ధర వస్తే కానీ మిర్చి రైతుకు గిట్టుబాటు కాదన్నారు.

➡️