- మంత్రులు ఫరూక్, బిసి జనార్దన్ రెడ్డి
ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్ : కర్నూలులో త్వరలో రాష్ట్ర హైకోర్టు బెంచ్ ప్రారంభించికార్యకలాపాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసి జనార్థన్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని వైసిపి ప్రకటించి అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని, ఇప్పుడు వాటిని సరిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానించినట్లు తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేశామన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.