కాపు రిజర్వేషన్లపై హైకోర్టు సందేహం

Dec 5,2024 02:54 #AP High Court, #kapu reservation

ప్రజాశక్తి-అమరావతి : ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఇడబ్ల్యుఎస్‌) విద్య, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్ల కల్పన చట్టానికి లోబడి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హైకోర్టు సందేహాన్ని వ్యక్తం చేసింది. ఇడబ్ల్యుఎస్‌ కోటా 10 శాతం రిజర్వేషన్లలో ఒక్క కాపులకే 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేసింది.
ఇది సముచితంగా లేదని వ్యాఖ్యానించింది. ఇడబ్ల్యుఎస్‌ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ, కాపులకు 5 శాతం రిజర్వేషన్ల చట్టాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషన్లపై పరిణామాలను తమకు నివేదించాలంది. ఆ తర్వాత తగిన ఉత్తర్వులు ఇస్తామని చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ప్రకటించింది. విచారణను జనవరి 29కు వాయిదా వేసింది. ఇడబ్ల్యుఎస్‌ కోటా 10 శాతంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికీ అమలు చేయకపోవడాన్ని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య, రాజమండ్రికి చెందిన అడ్డేపల్లి శ్రీధర్‌, లక్ష్మణ్‌, విజయవాడకు చెందిన కమ్మిలి కృష్ణ, ఉత్కర్ష్‌ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే ఇడబ్ల్యుఎస్‌ కోటాలో 5 శాతం కాపులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెంకు చెందిన పెద్ది రామకృష్ణ, కర్నూలుకు చెందిన కె చంద్రశేఖర శర్మ, మిత్రవింద ఇతరులు వేరుగా వ్యాజ్యాలు వేశారు.

➡️