రాజమండ్రి వైసిపి ఆఫీసు కూల్చద్దు : హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : రాజమహేంద్రవరంలో వైసిపి ఆఫీసు కూల్చివేతకు మున్సిపల్‌ అధికారులు ఇచ్చిన తుది ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. భవన నిర్మాణ అనుమతుల రెన్యువల్‌కు అధికారులకు దరఖాస్తు ఇచ్చేందుకు వైసిపికి వెసులుబాటు ఇచ్చింది. ఆ దరఖాస్తుపై తుది నిర్ణయం తీసుకునే వరకు కూల్చివేత ఉత్తర్వులను అమలు చేయరాదని జస్టిస్‌ బి కృష్ణమోహన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమయంలో తదుపరి నిర్మాణాలేవీ చేపట్టద్దని పార్టీని ఆదేశించారు. మున్సిపల్‌ అధికారుల ఉత్తర్వులను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా వేసిన వ్యాజ్యాలపై విచారణ చేశాక కూల్చివేత చర్యలకు పాల్పడొద్దని ఉత్తర్వులు జారీ చేశారు.

రాజకీయ కక్షే.. : వైసిపి నేతలు
టిడిపి ఆఫీసుపై దాడి చేశారనే ఫిర్యాదులో తమ పేర్లు లేవని, రాజకీయ కక్షతో తమను కేసులో ఇరికించారని వైసిపి నేతలు హైకోర్టుకు నివేదించారు. వైసిపి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపి నందిగం సురేష్‌, విజయవాడ నేత దేవినేని అవినాష్‌ ఇతరులు తరపున న్యాయవాదులు వాదించారు. పిటిషనర్లు దాడి చేసినట్లు ఫిర్యాదుదారే చెప్పడం లేదన్నారు. మూడేళ్ల తర్వాత కేసులో కొత్త పేర్లను పోలీసులు ఇరికిస్తున్నారని చెప్పారు. టిడిపి ఆఫీసుపై దాడి కేసులో తమకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల ఐదుకు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ వక్కలగడ్డ కృపాసాగర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

భద్రత కుదింపు అన్యాయం
ప్రాణహాని ఉన్నందున తన భద్రతను 1ప్లస్‌1 నుంచి 3ప్లస్‌3కి పెంపు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని జస్టిస్‌ బి కృష్ణమోహన్‌ శుక్రవారం విచారణ జరిపి పోలీసులు కౌంటర్‌ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు. విచారణను ఈ నెల 7కు వాయిదా వేశారు. ఎమ్మెల్యేకు భద్రత కుదింపు అన్యాయమని, గతంలోని భద్రత కొనసాగించాలని ఎస్‌పికి వినతిపత్రం ఇచ్చినా చర్యలు లేవని పిటిషనర్‌ తరపున న్యాయవాది తెలిపారు.

 

➡️