ప్రజాశక్తి – అమరావతి :ఉద్యోగి సర్వీస్ వివాదంపై సాటి ఉద్యోగులు మాత్రమే కోర్టుల్లో సవాలు చేయాలని, సర్వీసులో లేని, సంబంధం లేని మూడో వ్యక్తి పిటిషన్లు దాఖలు చేయడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ కె. మన్మథరావు ఇటీవల తీర్పు వెలువరించారు. శ్రీకృష్ణ గీత ఆశ్రమం ఇఓపై దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేశారు. కడప జిల్లా. ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీత ఆశ్రమం కార్యనిర్వహణ అధికారి (ఇఓ) సి.శంకర బాలాజీని దేవాదాయ శాఖ ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించడాన్ని సవాల్ చేస్తూ ఎం.సురేష్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిని న్యాయమూర్తి కొట్టివేశారు. సర్వీసు ఉద్యోగాల్లో సహ ఉద్యోగే బాధితుడు అవుతారని తెలిపారు. ప్రభుత్వ సంస్థలో పని చేయని, ఆ సంస్థ పరిపాలన వ్యవహారాలతో సంబంధం లేని ఏ వ్యక్తి కూడా ఆ సంస్థ కార్యకలాపాలను, అధికారుల చర్యలను ప్రశ్నిస్తూ అధికరణ 226 కింద రిట్ పిటిషన్ వేసేందుకు వీల్లేదని పేర్కొంది. ఆ సంస్థ, ఆ అధికారి చర్యలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే వేరే రూపంలో సవాలు చేయవచ్చని తెలిపింది.
