CPM: ప్రత్యేక హోదా విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు న్యాయం కాదు

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో హైకోర్టులో దాఖలైన పిల్‌పై బెంచ్‌ స్పందిస్తూ రాత పూర్వక హామీ లేనందున దీనిపై వ్యాజ్యంగా తీసుకోలేమని చెప్పడం న్యాయం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీనిపై గురువారం ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటులో ప్రధాని చేసిన ప్రకటనకు విలువ లేదని కేంద్రం వాదించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని తెలిపారు. వామపక్ష ఎంపిలతో పాటు బిజెపి సభ్యులు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేశారని, నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ప్రకటన కూడా చేశారని పేర్కొన్నారు. అప్పుడు రాత పూర్వక హామీ ఇవ్వలేదని, దీనికి విలువ లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ముమ్మాటికీ విద్రోహమేనని తెలిపారు. ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు.

దళిత క్రిస్టియన్లను ఎస్‌సిలుగా గుర్తించాలి

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో దళిత క్రిస్టియన్లను ఎస్‌సిలుగా గుర్తించాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మతం, మారినంత మాత్రాన కుల వివక్ష పోలేదని, అంటరానితనం కొనసాగుతూనే ఉందని, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగంలో దళితులకు కల్పించిన హక్కులను మతంతో నిమిత్తం లేకుండా అందరికీ వర్తించేలా చట్టాన్ని సవరించాలని కోరారు.

➡️