ఆలయాలకు నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీ

  • మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులను సూచించడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. వివిధ డెయిరీ సంఘాల సంస్థల ప్రతినిధులతో దేవాదాయశాఖ కమిషనరు కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. కమిటీలో సీనియర్‌ అధికారులు, డెయిరీల ప్రతినిధులు, ఎస్‌వి డెయిరీ కళాశాల ప్రతినిధులు, ఇతర నిపుణులను నియమించి నివేదిక తెప్పించాలని దేవాదాయశాఖ కమిషనరు సత్యనారాయణను ఆదేశించారు. కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితులను అధ్యయనం చేయాలన్నారు. నెయ్యి ఉత్పత్తికి అవసరమైన పాల లభ్యత, ఏయే ప్రాంతాల్లో గో సంపద ఎక్కువగా ఉన్నదనే విషయాలన్నింటిపైనా ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో అవసరాల నిమిత్తం ఏటా సుమారు 1,500 టన్నుల ఆవు నెయ్యి అవసరమని, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో సేకరించేలా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంగం డెయిరీ ఛైర్మన్‌, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. ఆలయాలకు అవసరమైన నెయ్యిని స్థానికంగా ఉన్న డెయిరీల నుంచే (రాష్ట్రంలోని ఉత్పత్తి దారుల నుంచి) సేకరించాలని, వివిధ యూనియన్లు, డెయిరీల మధ్య సహజంగా ఉండే పోటీని కూడా దృష్టిలో ఉంచుకుని నెయ్యి సేకరణ విధాన రూపకల్పనలో అన్ని డెయిరీలకూ సమాన అవకాశాలు లభించేలా చూడాలని మంత్రిని కోరారు.

➡️