ప్రజాశక్తి-కొడవలూరు, మంగళం : నెల్లూరు జిల్లా హిజ్రా నాయకురాలు హాసినిని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి హత్య చేశారు. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం, పార్లపల్లి మహాలక్ష్మమ్మ దేవాలయాన్ని దర్శించుకుని కారులో ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో కొడవలూరు మండలం, టపాతోపు అండర్ బ్రిడ్జి కిందకు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కత్తులతో ఆమెపై దాడి చేశారు. తోటి వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. పోస్టుమార్టం అనంతరం తిరుపతి జిల్లా మంగళం గ్రామపంచాయతీ శ్మశాన వాటికలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు, టిడిపి, జనసేన నాయకులు నివాళులర్పించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లా హిజ్రాలపై హాసిని ఆధిపత్యం చలాయిస్తుండడంతో ఇది గిట్టని వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొడవలూరు పోలీసులు తెలిపారు.