వరద బాధితులందరికీ సాయం అందించాం : హోంమంత్రి అనిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడ వరదల్లో బాధితులందరికీ ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాసనమండలి ప్రశ్నోత్తరాలు చైర్మన్‌ కె మోషేన్‌ రాజు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైంది. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు రూ.497.07 కోట్లు విరాళంగా వచ్చాయని వైసిపి సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్‌, మహమ్మద్‌ రూహుల్లా అడిగిన ప్రశ్నకు శాసనమండలిలో మంత్రి అనిత సమాధానం చెప్పారు. వరద బాధిత కుటుంబాలు, వ్యక్తులకు సహాయం, ఉపశమనం అందించడానికి విరాళాల నుంచి రూ.274.95కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ పరిహారం అందక చాలా మంది బాధితులు రోడ్డెక్కి ధర్నా చేశారని, వారిపై పోలీసులు కూడా లాఠీచార్జ్‌ చేశారని తెలిపారు. వరద వచ్చిన సమయంలో ఆపరేషన్‌ బుడమేరు చేపడతామని మున్సిపల్‌ శాఖమంత్రి పి నారాయణ వెల్లడించారని తెలిపారు. ఈ పనులు ఎంత వరకు వచ్చాయో చెప్పాలని కోరారు. రూహుల్లా మాట్లాడుతూ సాయం అందని బాధితులు చాలా మంది ఉన్నారని, ఈ అంశంపై కమిటీ వేయాలని కోరారు. మంత్రి అనిత మాట్లాడుతూ సాయం అందని బాధితులు కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అందిస్తామన్నారు. పరిహారం అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య కొంత వాగ్యువాద్ధం చోటుచేసుకుంది.

మద్యం అమ్మకాల్లో 99వేల కోట్ల నగదు లావాదేవీలు: మంత్రి కొల్లు

గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో నగదు లావాదేవీలు రూ.99వేల కోట్లు జరిగాయని ఎక్సైజ్‌ శాఖమంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. 2019 నుంచి 2024 వరకు సుంకం చెల్లించని మద్యంపై 34,177 కేసులు నమోదు అయినట్లు, 40,918 మందిపై కేసులు నమోదు చేశామని టిడిపి సభ్యులు పి అశోక్‌బాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ప్రభుత్వం మద్యం ధరలను పెంచడం వల్ల ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకున్నారని, తద్వారా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందన్నారు.

➡️