గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణకు ‘ఈగల్‌’ : హోంమంత్రి అనిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటి నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్సుకు ‘ఈగల్‌’ పేరును నిర్ణయించినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం మోపేలా ప్రతి జిల్లాలో నార్కోటిక్‌ కంట్రోల్‌ సెల్‌, నార్కోటిక్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలను చైతన్య పరిచి డ్రగ్స్‌ వాడకాన్ని పూర్తిగా నిరోధిస్తామని తెలిపారు. ‘మహాసంకల్పం’ పేరుతో అవగాహన సదస్సుల నిర్వహణకు కసరత్తు జరుగుతోందన్నారు. అలాగే సమాచార, ప్రజా సంబంధాల శాఖ (ఐ అండ్‌ పిఆర్‌), ఏపి డ్రోన్‌ కార్పోరేషన్‌ భాగస్వామ్యంతో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ‘ఈగల్‌ 1972’ టోల్‌ ఫ్రీ నంబరును త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ నియంత్రణ కోసం జిపిఎస్‌, ఆర్‌ఎఫ్‌ఐడి, ట్రాకింగ్‌ సిష్టం, ఎఐ ఆధారిత సిసి నిఘా, ఫేషియల్‌ రికగ్నైజేషన్‌, ప్రొఫైలింగ్‌, సోషల్‌ మీడియా మానిటరింగ్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్‌, సైబర్‌ ఇంటిలిజెన్స్‌, ఐటి టెక్నాలజీని సమర్ధవంతంగా వినియోగించుకోవాలన్నారు. పోలీస్‌, జిఎడి, వైద్య, అటవి శాఖ, జిల్లాల్లోని అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని క్షేత్ర స్థాయిలో గంజాయి, డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకొనున్నట్లు చెప్పారు. విద్య, మున్సిపల్‌, రవాణా, యువజన, గిరిజన శాఖల సహకారం కూడా తీసుకుంటామన్నారు. రాబోయే ఆరు నెలల్లో గంజాయిని అంతమొందించే దిశగా అన్ని మార్గాలపైనా దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌, స్త్రీశిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సంధ్యారాణి, ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

➡️