- ప్రభుత్వ అనుమతి రాగానే నియామకం
- శాసనసభలో హోం మంత్రి అనిత
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మొత్తం 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పోలీస్ కానిస్టేబుల్స్‌్ నియామకం, సిఐలకు డిఎస్‌పిలుగా ప్రమోషన్లు గురించి అనకాపల్లి శాసనసభ్యులు కొణతాలరామకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిస్తూ వీటిలో 6,100 పోస్టుల నియామకం త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి, డిజిపికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనుమతులు రాగానే మిగిలిన ఆ నియమాకాలు కూడా చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు బెటాలియన్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని, ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు గురించి కేంద్రానికి కూడా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పోలీసుల ఆరోగ్య భద్రత్కఉ సంబంధించి కొన్ని ప్రతిపాదనలు రూపొందించి సిఎం, హోమ్ సెక్రటరీ, డిజిపిలతో చర్చించినట్లు చెప్పారు. హైబ్రిడ్ మోడ్‌లో కానిస్టేబుల్ స్ధాయి నుంచి అందరికీ రూ.10నుంచి రూ.15లక్షల వరకు ఆరోగ్యభద్రత కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుని పోలీసులసంక్షేమం కోసం అమలు చేస్తామన్నారు. పోలీస్ ఇనెస్పెక్టర్ల ప్రమోషన్లపై మాట్లాడుతూ డిఎస్‌పపి పదోన్నతులు ఇవ్వకపోవడానికి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సీనియారిటీ జాబితాను సవరించడమేనన్నారు. 2017లో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2018లో సీనియారిటీ జాబితాను ప్రభుత్వం జారీ చేసిందన్నారు.