- నంద్యాల, విజయనగరం బాధితులకు ఆర్థికసాయం : హోంమంత్రి అనిత
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అత్యాచారాల నిరోధానికి చర్యలు తీసుకోవడంతో పాటు నేరస్తులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం లా అండ్ ఆర్డర్ అమలు, గంజాయి, చీప్ లిక్కర్‌ను అరికట్టే అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలోని అంశాలను హోంమంత్రి మీడియాకు వెల్లడించారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి అత్యాచార బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం, విజయనగరం జిల్లా అత్యాచార బాధిత పసికందుకు రూ.5 లక్షలను ఫిక్సిడ్ డిపాజిట్ రూపంలో సిఎం మంజూరు చేశారని, త్వరలోనే ఆ పరిహారాన్ని ఆ కుటుంబాలకు స్వయంగా అందజేస్తానని ఆమె తెలిపారు. ముచ్చుమర్రి బాలిక ఘటనపై ఇప్పటికే ముగ్గురు మైనర్లను అరెస్టు చేశామని, రోజుకో మాట మార్చడంతో బాలిక మృతదేహం ఆచూకీ ఇంకా లభించలేదన్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బలగాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి దోషులకు శిక్షలు త్వరితగతిన పడేలా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. పసికందు ఘటనపై జిల్లా ఎస్‌పితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, మద్యం మత్తులో సంఘటన జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. గంజాయి, నకిలీ మద్యానికి బానిసైన వారి కోసం డి ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.