త్వరలో కానిస్టేబుళ్ల నియామకాలు : హోంమంత్రి అనిత

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 6,100 పోస్టులకు సంబంధించిన శారీరక సామర్ధ్య (పిఎంటి, పిఇటి) పరీక్షలను ఐదు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 2022 లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరు కాగా, అందులో 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో సహా పలు కారణాల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడిందని తెలిపారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌ ప్రకియలో రెండవ దశను వెంటనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రెండవ దశ అప్లికేషన్‌ ఫారం నింపడానికి, భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఆమె తెలిపారు. ఈ దశలో ఉత్తీర్ణులైన వారికి తుది దశగా రాతపరీక్ష ఉంటుందని తెలిపారు.

హోం మంత్రికి ధన్యవాదాలు : నారా లోకేష్‌
అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్‌ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ప్రజా దర్బార్‌లో ఈ మేరకు పలువురు నిరుద్యోగులు తమ సమస్యలు వివరించారని పేర్కొన్నారు. ఆ వినతులను హోంమంత్రికి పంపిన వెంటనే సానుకూలంగా స్పందించారని తెలిపారు.

➡️