- హతురాలి కుటుంబ సభ్యులకు మంత్రుల పరామర్శ
ప్రజాశక్తి- పుంగనూరు (చిత్తూరు జిల్లా) : బాలిక హత్యపై రాజకీయం చేయడం తగదని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇటీవల అదృశ్యమైన బాలిక హత్యకు గురైన నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులను మంత్రి అనిత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ ఆదివారం పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకొని వారిని ఓదార్చారు. న్యాయం చేస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మంత్రి అనిత మాట్లాడుతూ పుంగనూరుకు చెందిన బాలిక హత్య కేసులో ఎవరినీ వదలబోమన్నారు. బాలిక తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన సమయంలో వారిని మరింత బాధపెట్టేలా తప్పుడు ప్రసారాలు సమంజసం కాదని పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్‌పి మణింకఠ చందోలు దర్యాప్తు చేపట్టారని, రెండు రోజులపాటు పుంగనూరులోనే ఉండి బాలికను సజీవంగా తల్లిదండ్రులకు అప్పగించేందుకు 12 బృందాలు, క్లూస్ టీములు, డాగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే, బాలిక మృతదేహం స్టోరేజ్ ట్యాంకులో తేలడం అత్యంత బాధాకరమన్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంఘటన దురదష్టకరమని, బాలికను దారుణంగా హత్య చేశారని తెలిపారు. బాలిక మృతిని రాజకీయ కోణంలో చూడొద్దని, బాలిక పేరును సోషల్ మీడియాలో పదేపదే ప్రస్తావించడం, అత్యాచారం జరిగినట్లు చిత్రీకరించడం తగదన్నారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
సిఎం పరామర్శ
చిన్నారి కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఫోన్లో పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధైర్యపడొద్దని, దోషులను శిక్షిస్తామని ఓదార్చారు. బాలికను కాపాడేందుకు పోలీసు వ్యవస్థ శత విధాలా ప్రయత్నించిందని, బాలిక హత్యకు గురవడం బాధ కలిగించిందని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని బాలిక తండ్రికి హామీ ఇచ్చారు.