గౌరవ వేతనం రూ. 25 వేలకు పెంచాలి

వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థుల ధర్నా

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : ‘చదివేది ఐదేళ్లు. మిగిలేది కన్నీళ్లు. గౌరవ వేతనం (స్టైఫండ్‌) పది వేలు వద్దు. రూ. 25వేలు కావాలి. మా స్టైఫండ్‌ మా హక్కు.’ అనే నినాదాలతో విజయవాడ ధర్నా చౌక్‌ దద్దరిల్లింది. వెటర్నరీ విద్యార్థులకు గౌరవ వేతనం (స్టైఫండ్‌) రూ. 25 వేలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయ విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎపి వెటర్నరీ స్టూడెంట్స్‌ అండ్‌ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్రాంత్‌ ధర్మతేజ, సంయుక్త కార్యదర్శి వై.పునీత్‌ మాట్లాడుతూ ఇతర ఆరోగ్య సంబంధిత విద్యారంగాల్లో ఇంటర్న్‌లు, పిజిలు, పిహెచ్‌డి విద్యార్థులకు రూ.25 వేల నుంచి రూ.65 వేల వరకు స్టైఫండ్‌ చెల్లిస్తోన్న ప్రభుత్వం పశు వైద్య విద్యార్థుల స్టైఫండ్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెటర్నరీ విద్యార్థులకు ఇస్తున్న రూ.7,000 స్టైఫండ్‌ను మరో రూ.3,500 మాత్రమే పెంచి రూ.10, 500 మాత్రమే ఇస్తామనడం సరికాదన్నారు. వెటర్నరీ విద్యార్థులకు స్టైఫండ్‌ను రూ.25 వేలకు పెంచే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.

విద్యార్థులకు పలువురి సంఘీభావం
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బండెల బి. నాసర్జి, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కెవివి ప్రసాద్‌ తదితరులు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

➡️