ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం వర్చువల్‌లో శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజల బతుకులను దెబ్బతీసే బల్క్ డ్రగ్ పార్కు శంకుస్థాపనను వ్యతిరేకిస్తూ నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన తెలపాలని సిపిఎం ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో ప్రభుత్వం నిరంకుశ చర్యలకు పాల్పడుతోంది. ఆందోళనకారుల కదలికలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజును మంగళవారం ఉదయం నుంచి గృహ నిర్బంధం చేశారు. ఆ పార్టీ అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్.రాము, మండల కమిటీ సభ్యులు సోమునాయుడు, కె.కోటపాడు మండల నాయకులు ఎర్రా దేముడు, కశింకోట మండల నాయకులు దాకారపు శ్రీనివాసరావు, డిడి.వరలక్ష్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప్రభుత్వ, పోలీసు తీరును సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. లోకనాథం, అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఖండించారు.