టిటిడి కార్మికులకు ఇళ్ల స్థలాలు

– కల్యాణకట్ట క్షురకులకు రూ.20 వేలు

– ధర్మకర్తల మండలిలో తీర్మానం

ప్రజాశక్తి – తిరుమలటిటిడి కార్మికులకు తొలి విడతగా 3518 మందికి గురువారం ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ధర్మకర్తల మండలిలో తీర్మానం చేశారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాలను టిటిడి చైర్మన్‌ మీడియాకు వివరించారు. ఆయన వివరాల మేరకు.. మరో వారం పది రోజుల్లో మరో 1500 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి రూ.80 కోట్లు చెల్లించి మరో 350 ఎకరాల భూమి సేకరించి ఫిబ్రవరిలోపు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి బోర్డు తీర్మానం చేసిందని తెలిపారు. తిరుమల కల్యాణకట్టలో పీస్‌రేట్‌ లెక్కన పనిచేస్తున్న క్షురకులకు నెలకు రూ.20 వేలు కనీస వేతనం అందించాలని, ఈ నిర్ణయం వల్ల దాదాపు 250 కుటుంబాలకు మేలు జరగనుందన్నారు. శాశ్వత ఉద్యోగులు కాని పోటు కార్మికులకు రూ.10వేలు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని, దాదాపు 350 కుటుంబాలకు లబ్ది చేకూరనుందని చెప్పారు. వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్‌ లేబర్‌గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం, టిటిడిలోని వివిధ విభాగాల్లో మిగిలిన కాంట్రాక్టు కార్మికుల జీతాలు కనీసం రూ.మూడు వేలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. పెద్దజీయర్‌, చిన్నజీయర్‌ మఠాల నిర్వహణ, అక్కడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి పెద్దజీయర్‌ మఠానికి ఏటా రూ.60 లక్షలు, చిన్న జీయర్‌ మఠానికి ఏటా రూ.40 లక్షల అదనపు ఆర్థిక సాయం చేయాలని బోర్డులో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

➡️