రాజీ ఎలా చేసుకున్నారు ? : హోంమంత్రి అనితపై చెక్‌బౌన్స్‌ కేసులో హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : తనపై నమోదైన చెక్‌బౌన్స్‌ కేసులో ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరిందని హైకోర్టును హోంమంత్రి వంగలపూడి అనిత ఆశ్రయించారు. ఫిర్యాదుదారు, తన మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో విశాఖలోని 7వ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులోని కేసును కొట్టేయాలని ఆమె కోరారు. ఏ విధంగా రాజీ చేసుకున్నారో వివరించకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. అనిత తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదంటూ కింది కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన వేగి శ్రీనివాసరావుతో స్వయంగా మాట్లాడింది. ఎంత మొత్తానికి రాజీ కుదిరిందో ఆరా తీసింది. కింది కోర్టులో తప్పుడు కేసు వేశారనే అభియోగాల మాటేమిటని ప్రశ్నించింది. కింది కోర్టులోని కేసును ఏం చేస్తారని కూడా ప్రశ్నించింది. దీనిపై శ్రీనివాసరావు.. తాను అనితపై తప్పుడు కేసు పెట్టలేదని, డబ్బు కోసం తిరగలేక రాజీ చేసుకున్నట్లు చెప్పారు. అనిత తరపున న్యాయవాది సతీష్‌ కల్పించుకుని రాజీ జరిగినందున శ్రీనివాసరావు తనపై దాఖలు చేసిన చెక్‌బౌన్స్‌ కేసును కింది కోర్టులో కొనసాగించరాదన్నారు. దీనిపై హైకోర్టు.. ఇదెలా రాజీ అవుతుందని, పోరాటం చేయకపోవడం వల్ల రాజీ చేసుకోవడం ఎలా అవుతుందని కూడా ప్రశ్నించింది. రాజీని రికార్డ్‌ చేయడానికి వీలుగా అన్ని వివరాలు తమకు నివేదించాలని అనితను ఆదేశించింది. ఈ నెల 10న జరిగే విచారణకు శ్రీనివాస్‌రావు ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ విఆర్‌కె కృపాసాగర్‌ సోమవారం ఆదేశించారు. అనిత 2015 అక్టోబరు ఒకటిన వేగి శ్రీనివాసరావు నుంచి ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ.70 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ మొత్తం తీర్చకపోవడంతో 2018లో అనితపై శ్రీనివాసరావు సూట్‌ వేశారు. ఇటీవల అనిత హోంమంత్రి అయ్యారు. ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరిందని ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

➡️