- రాజధాని రైతులను ప్రశ్నించిన ప్రపంచబ్యాంకు బృందం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ‘రాజధానిలో భూములు ఇచ్చిన తరువాత మీ ఉపాధి ఎలా ఉంది ? ప్రభుత్వం ఇచ్చే కౌలు సరిపోతుందా ? భూమిలేనివారు ఇప్పుడేమి చేస్తున్నారు ? ముంపు ప్రాంతమని తెలిసింది ? ఇటీవల కురిసిన వర్షాలకు వరద వచ్చిందన్నారు ఏమైంది ? ‘అంటూ ప్రపంచబ్యాంకు ప్రతినిధులు రైతులను ప్రశ్నించారు. రూ.15 వేల కోట్ల నిధుల కేటాయింపులో భాగంగా అమరావతి రాజధాని పరిధిలో రైతులతో ప్రపంచబ్యాంకు బృందం ప్రతినిధులు మంగళవారం భేటీ అయ్యారు. తొలిసారి పెద్దరైతులతో చర్చించిన అనంతరం రెండోసారి దళిత రైతులతోపాటు, అమరావతి జెఎసి నాయకత్వంతోనూ సమావేశమైంది. తుళ్లూరు సిఆర్‌డిఏ కార్యాలయంలో సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో అమరావతికి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రపంచబ్యాంకు ప్రతినిధులు రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే సమావేశానికి ఎంపిక చేసిన వారినే ఆహ్వానించారు. 10 మందితో కూడిన ప్రపంచబ్యాంకు బృందంలో ముగ్గురు తెలుగు వారు కూడా ఉన్నారు. బృందం ప్రశ్నలకు రైతులు కూడా వారికి తెలిసిన సమాచారాన్ని తెలిపారు. వరదపై అడిగిన ప్రశ్నలకు ఎన్నడూ లేనంత వర్షం కురవడంతో పాటు అక్కడక్కడ అడ్డుకట్టలు పడటంతో నీరు నిలిచిందని, అయితే వెంటనే బయటకు వెళ్లిపోయిందని రైతులు జవాబు ఇచ్చారు. పాలవాగు, కొట్టేళ్లవాగులో తూటుకాడ, గుర్రపుడెక్కను తొలగిస్తే నీటి ప్రవాహం సవ్యంగా సాగిందని వివరించారు. తొలుత ఇచ్చిన మాస్టర్‌ప్లాను ప్రకారం కాలువలు నిర్మించి ఉండే ఈ సమస్య ఉండేది కాదని తెలిపారు. భూమి, ఉపాధి తదితర ప్రశ్నలకు జవాబిస్తూ పొలాలు ఇచ్చిన తరువాత ఉపాధి కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలో శిక్షణ ఇప్పించారని, దీనివల్ల కొంత ఉపాధి దొరుకుతోందని చెప్పారు. కుటీర పరిశ్రమలకు ప్రభుత్వం కూడా రుణం ఇస్తామందని, చదువకున్న వారికైతే రూ.25 లక్షల వరకూ ఇస్తామన్నారని ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు తెలిపారు. అలాగే తమకు పట్టా భూముల రైతులతో కౌలు ఇచ్చారని, అందులో లోపాలు జరిగాయని గత ఐదేళ్లలో విచారణకు ఆదేశించడంతో కొంత కౌలు నిలిపేశారని వివరించారు. అయితే రైతులకు ఇచ్చిన చోటే తమకూ భూములను లాటరీ పద్ధతిలో కేటాయించారని స్పష్టం చేశారు. ఇక్కడ ఎకరం అమ్ముకుంటే బయట ప్రాంతాల్లో రెండు నుండి మూడు ఎకరాలు కొనుగోలు చేసుకున్నామని వివరించారు. అభివృద్ధి చెందిన తరువాత కొంత ధర పెరిగిందనీ చెప్పారు. ఈ సారి తెలుగు ప్రతినిధులు కూడా ఉండటంతో క్షేత్రస్థాయికి సంబంధించిన అంశాలనే ఎక్కువగా ప్రస్తావించారు. వీటిల్లో జీవనం, ఉపాధి కోసం ఏమిచేస్తున్నారనే విషయాలను ఎక్కువగా అడిగి తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పనులూ నిలిపేయడంతోపాటూ అనేక ఇబ్బందులకు గురిచేసిందని పేర్కొన్నారు. రైతులపై ఎక్కడికక్కడ కేసులు పెట్టి వేధించడంతో తాము అనివార్యంగా జెఎసి ఏర్పాటు చేసుకున్నామని, దీనిలో వేర్వేరు కమిటీలు పెట్టుకుని కేసులు, ఆర్థిక అంశాలను సవ్యంగా నెరవేర్చుకున్నామని చెప్పారు. హైకోర్టులోనూ పెద్దఎత్తున కేసులు దాఖలు చేశామని, వాటిల్లో ఎక్కువ శాతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతులకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని చెప్పారు. మూడు రాజధానుల ప్రకటన ఇక్కడ రైతుల్లో ఆందోళనను కలిగిందని పేర్కొన్నారు. రైతు ప్రతినిధుల తరుపున నీరుకొండ రైతు మాదల వాసు ప్రపంచబ్యాంకు బృందానికి అన్ని వివరాలూ తెలిపారు. చర్చ జరుగుతుండగానే జెఎసి ప్రతినిధులు వారు చెప్పాల్సింది చెప్పి బయటకు వచ్చేయగా అక్కడే ఉన్న కొంతమంది రైతులతో ప్రపంచబ్యాంకు బృందం సభ్యులు వేర్వేరుగా మాట్లాడారు. సిఆర్‌డిఏ అదనపు కమిషనర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.