- గుంటూరు కోర్టులో రఘురామకృష్ణ రాజు
ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : సిఐడి అధికారులు కస్టోడియల్ టార్చర్ చేసిన ఘటనలో వాంగ్మూలం ఇచ్చేందుకు డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు బుధవారం గుంటూరు కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి కె.లలిత ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆయన్ను కోర్టు విచారించి వాంగ్మూలం నమోదు చేసింది. కోర్టు లోపలికి వెళ్లే ముందు, తరువాత ఆయన రెండుసార్లు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సిఐడి కస్టడీలో తనను కొట్టిన కామేపల్లి తులసిబాబు న్యాయవాదిగా నమోదు చేసుకోకున్నా ఆయనకు గత ప్రభుత్వం భారీగా పారితోషికం ఇచ్చిందన్నారు. దాదాపు కోటి రూపాయిలు లీగల్ సలహా కింద తులసిబాబు సొమ్ము తీసుకున్నారని తెలిపారు. న్యాయవాదిగా నమోదు కాకుండానే ప్రభుత్వం డబ్బులు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. దీనిపై తాను సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఐపిఎస్ అధికారిని ఇంత వరకు సస్పెండ్ చేయలేదని, అరెస్టు కూడా చేయలేదన్నారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. తనపై దాడి చేసి కొట్టిన దెబ్బలకు సంబంధించి నివేదికలు మార్చిన ఘటనలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ముమ్మాటికి నిందితురాలేనని పేర్కొన్నారు. ఆమెకు సుప్రీం కోర్టులో బెయిల్ వచ్చిందని, ఇందుకు తాను అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేస్తానని తెలిపారు.