HPHCEU: పెంచిన జీతాలు అమలు చేయాలి

Mar 16,2025 22:19 #rural health center

యుపిహెచ్‌సిఇయు డిమాండ్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ (యుపిహెచ్‌సి) ఉద్యోగులకు గత ప్రభుత్వం జీతాలు పెంచుతూ ఉత్తర్వులిచ్చి అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అర్బన్‌ ఫ్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (యుపిహచ్‌సిఇయు) రాష్ట్ర సర్వసభ్య సమావేశం ప్రధాన కార్యదర్శి జె సింహాచలం అధ్యక్షతన విజయవాడలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ… వైదారోగ్యశాఖ కమిషనర్‌ అప్పుడు జరిగిన జెఎసి చర్చల్లో అంగీకరించిన హామీలను నేటికీ నెరవేర్చకుండా తాత్సారం చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో కన్వీనింగ్‌ కమిటీ కన్వీనర్‌గా టి రాజారత్న రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుపిహెచ్‌సి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్‌ను నెరవేర్చాలని, లేకుంటే ఉద్యోగులంతా ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జూన్‌ 22న నిర్వహించనున్న యుపిహెచ్‌సి ఉద్యోగుల రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గన్నారు.

ఆయుష్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం వీరే…
ఆయుష్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని విజయవాడ, సిఐటియు కార్యాలయంలో ఆదివారం జరిగిన రాష్ట్ర సమావేశంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా ఎవి నాగేశ్వరరావు, అధ్యక్షులుగా రామానంద్‌, ఉపాధ్యక్షులుగా రషీద్‌, ఎ శ్రీనివాసరావు, సంపత్‌, జనరల్‌ సెక్రటరీగా టి అంజలీదేవి, సెక్రటరీగా సునీత, భాను బేగం, రమేష్‌, ట్రెజరర్‌గా ఎమ్‌డి షఫీ, మరో పది మంది కార్యవర్గ సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎపి ఎన్‌హెచ్‌ఎం జెఎసి హానరరీ ఛైర్మన్‌ ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం), ఆయుష్‌ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ, పిఎఫ్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎపి ఎన్‌హెచ్‌ఎం జెఎసి ఛైర్మన్‌ దయామని మాట్లాడుతూ.. జిఓ 2ను సవరించి ఆయుష్‌, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఎంటిఎస్‌ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయుష్‌ డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది 15 ఏళ్లుగా పని చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదన్నారు. పనికి తగిన వేతనం చెల్లించడం లేదని తెలిపారు.

➡️