- టిడ్కో ఇళ్లకు మరో రూ.4,400 కోట్లు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని అమరావతికి రుణం ఇచ్చేందుకు హడ్కో ముందుకొచ్చింది రూ.11 వేల కోట్ల రుణానికి హడ్కో బోర్డు అంగీకరించింది. అలాగే టిడ్కో ఇళ్లకు మరో రూ.4,400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఈ మేరకు అంగీకరించినట్లు సమాచారం ఇచ్చారని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. దీంతో రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 50 శాతం సమకూరినట్లయింది. ఇప్పటికే ప్రపంచబ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఉమ్మడిగా రూ.15 వేలకోట్ల రుణం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.10 వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచారు. ఇప్పుడు అదనంగా మారో రూ.11 వేల కోట్లు రావడంతో రాజధానిలో ఇబ్బంది లేకుండా పనులు సాగుతాయని మంత్రి తెలిపారు. అలాగే నిధుల లేమితో టిడ్కో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిందని, వాటికి అవసరమైన నిధుల కోసమూ ప్రతిపాదనలు సమర్పించామని పేర్కొన్నారు. దీనికి స్పందించిన హడ్కో దానికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని వివరించారు. ఈ నిధులతో మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలతోపాటు అర్హులై ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. రాజధాని అమరావతి పూర్తి చేయాలంటే కనీసం రూ.45 వేల కోట్ల అవసరం ఉంటుందని అంచనాలు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ రూ.26 వేల కోట్లు రుణం రూపంలో రాజధానికి రానున్నాయి. ఈ నిధులతో తొలిదశలో పరిపాలనా భవనాలు, దాని చుట్టుపక్కల పూలింగు లేఅవుట్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, కరకట్ట విస్తరణ, గ్రీనరీ, రిజర్వాయర్లు, కాలువలు నిర్మించనున్నారు.