ఏడిదలో బాణసంచా పేలుడు

  • ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

ప్రజాశక్తి- మండపేట(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) : డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో ఒక పెంకుటింట్లో బాణసంచా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇళ్లు పూర్తిగా శిథిలమైంది. ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి మండపేట రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడిద పంచాయతీ కార్యాలయం సమీపంలో కల్లు వెంకటకృష్ణ తన భార్య, తల్లిదండ్రులతో కలిసి పెంకుటింట్లో ఉంటున్నారు. దీపావళికి ఔట్లు తయారు చేసేందుకు మందుగుండు సామగ్రిని ఇంట్లో నిల్వ ఉంచారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలుడు సంభవించింది. శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు భయబ్రాంతులయ్యారు. పేలుడు ధాటికి పెంకుటిల్లు పైకప్పు కుప్పకూలింది. వెంకటకృష్ణ, ఆయన భార్య జయశ్రీ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని మండపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంకటకృష్ణ (30) మృతి చెందారు. జయశ్రీ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామకృష్ణ తండ్రి శ్రీనివాస్‌, సావిత్రి గాయాలతో బయటపడ్డారు. రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️