‘ఉక్కు’పై ప్రధాని స్పందించాల్సిందే…

  • గాజువాకలో ప్రజలు, కార్మికులు భారీ ప్రదర్శన, బహిరంగ సభ

ప్రజాశక్తి- గాజువాక (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు విశాఖ నగరానికి రాకముందే ప్రధాని మోడీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ గాజువాకలో విశాఖ ప్రజలు, కార్మికులు ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాత గాజువాక నుంచి కొత్త గాజువాక, తిరిగి కొత్త గాజువాక నుంచి పాత గాజువాక కూడలి వరకూ నిర్వహించిన భారీ ప్రదర్శనకు స్థానికులు పూలుజల్లి ఎక్కడికక్కడ ఘనస్వాగతం పలికారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించాలన్న నినాదాలతో గాజువాక పరిసరాలు మార్మోగాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు, మహిళా, రైతు సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రదర్శనకు, అనంతరం జరిగిన బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్మికులు హాజరయ్యారు.

మోడీపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తేవాలి : సిహెచ్‌ నర్సింగరావు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించు కొనేలా ప్రధాన మంత్రి మోడీపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తేవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు కోరారు. ప్రదర్శన అనంతరం పాత గాజువాక కూడలిలో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న మహోన్నత ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకొని ప్రధాని తన పర్యటనలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్లాంట్‌ పరిరక్షణకు కార్మికులు చేస్తోన్న పోరాటాన్ని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ అండతో దేశాన్ని కార్పొరేట్‌ శక్తులు కబళించాలని చూస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసిన అదానీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిం చాలని డిమాండ్‌ చేశారు. గంగవరం పోర్టును అదానీ ఎలా లాక్కున్నారో అందరికీ తెలుసన్నారు. ఆ పోర్టు నుంచి 42 రోజుల పాటు స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు రాక స్తంభించించిన విషయాన్ని గుర్తు చేశారు.

‘ఉక్కు’ ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

రాష్ట్రాభివృద్ధితోపాటు ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరి మద్దతూ ఉక్కు ఉద్యమానికి ఉందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌ తెలిపారు. బహిరంగ సభలో వీరు మాట్లాడుతూ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్‌, కెఎస్‌ఎన్‌.రావు, నీరుకొండ రామచంద్రరావు, యు.రామస్వామి, జె.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో డిసిఎంఎస్‌ మాజీ చైర్‌పర్సన్‌ పల్లా చినతల్లి, ప్రజా సంఘాల నాయకులు మణి, రెడ్డి వెంకటరావు, కుమార మంగళం, కెఎం.శ్రీనివాసరావు, రాంబాబు, ఎన్‌.రామారావు, రైతు సంఘం నాయకులు ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️