- సినిమా ఫక్కీలో పోలీసుల రెస్క్యూ ఆపరేషన్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో పట్టపగలు కత్తులు, తుపాకులతో దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. ఆరుగురు సభ్యులుగల ముఠా ఓ షాపింగ్ మాల్‌లో చొరబడి దోపిడీకి విఫలయత్నం చేసింది. వారిలో నలుగురిని పోలీసులకు పట్టుకున్నారు. ఇద్దరు పరారయ్యారు. ఈ సందర్భంగా హైడ్రామా నడిచింది. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన నేపథ్యంలో నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం…. ముందుగా వేసుకున్న పధకం ప్రకారం ప్రెస్ స్టికర్‌తో ఉన్న ఓ మినీ వ్యాన్‌లో ఆరుగురు దుండగులు ఉదయం 5.30 గంటల సమయంలో గాంధీ రోడ్డులోని పుష్పా కిడ్స్ షాపింగ్ మాల్‌లో చొరబడి వస్తువుల చోరీకి యత్నించారు. వెంట తెచ్చుకున్న తుపాకులతో గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. షాపింగ్ మాల్ పైఅంతస్తులో నివసిస్తున్న షాపింగ్ మాల్ యజమాని చంద్రశేఖర్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించారు. షాపింగ్ సెంటర్ డోర్‌ను క్లోచ్ చేశారు. ఈ సందర్భంగా గోడ దూకే సందర్భంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. షాపింగ్ మాల్ యజమాని సమాచారం మేరకు పోలీసులు తొలుత చిన్నపాటి దొంగతనంగా భావించారు. టూ టౌన్ సిఐ, ఎస్‌ఐ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులు ఆరుగురు ఉన్నారని, వారి వద్ద తుపాకులు, కత్తులు ఉన్నాయని తెలియడంతో జిల్లా ఎస్‌పి మణింకంఠ చందోలు, డిఎస్‌పిలకు వారు సమాచారం అందించారు. తిరుపతి నుంచి స్పెషల్ ఫోర్స్‌ను రప్పించి జిల్లా ఎస్‌పి స్వయంగా రంగంలోకి దిగారు. షాపింగ్ మాల్ ఉన్న భవనం నలువైపులా పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతం నుంచి ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సినిమా షూటింగ్ తరహాలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. తొలుత నలుగురిని అరెస్టు చేశారు. మాల్‌లో దాక్కొని ఉంటారని భావించి మిగతా ఇద్దరి కోసం గంటల కొద్దీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినా వారి జాడలేదు. పట్టుబడిన ముఠా సభ్యుల నుంచి పోలీసులు రెండు తుపాకులను, బుల్లెట్ల మాగ్జిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. దొంగతనం కోసమే వెళ్లారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ దోపిడీ యత్నంలో చిత్తూరుకు చెందిన ఓ ఫర్నిచర్ యజమాని కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో డిఎస్‌పి సాయినాథ్, సిఐలు శ్రీనివాసరావు, జయరామయ్య ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, ఆక్టోపస్ పోలీసులు పాల్గొన్నారు. విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌పి తెలిపారు. దోపిడీకీ ప్రయత్నించిన వారు కర్నూలు, అనంతపురం ప్రాంతాలకు చెందిన వారై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరుగురిలో ఇద్దరు తప్పించుకొని ఉంటారని భావిస్తున్నారు.