మానవత్వమే ‘మతం’

  • కళాకారులకు టిటిడి అవకాశాలివ్వాలి
  • ‘ఆధ్యాత్మిక సమ్మేళనం’ రాష్ట్ర సదస్సులో వక్తలు

ప్రజాశక్తి – తిరుపతి సిటీ : ‘మానవత్వమే మతం.. వేదాల సారాంశం అంతా ‘శాంతి’మంత్ర ఉపదేశమే.. కలసి బతకడం.. కలసి భోంచేయడం.. కలసి నైపుణ్యాన్ని పెంచుకోవడం.. కలసి జ్ఞానాన్ని పంచుకోవడమే తప్ప ఎక్కడా కుల మత ప్రస్తావన లేదు. సమైక్యతను ప్రచారం చేయడమే ఆధ్యాత్మిక సమ్మేళనం ఉద్దేశం’ అని వక్తలు ఉద్ఘాటించారు. ‘ఆధ్యాత్మిక సమ్మేళనం’ రాష్ట్ర స్థాయి సదస్సు అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రం జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు విసి వెంకటయ్య అధ్యక్షతన మంగళవారం జరిగింది. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకరస్వామి మాట్లాడుతూ.. జానపద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, టిటిడిలో, వివిధ ఆలయాల్లో వారికి విరివిగా అవకాశాలు ఇవ్వాలని కోరారు. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాల్లో భక్తిబృందాలకు అవకాశం కల్పించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సనాతన ధర్మం గురించి పవన్‌కల్యాణ్‌ తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. సాక్షాత్తు రాష్ట్రపతినే దేవాలయంలోకి రానీయని స్థితి దేశంలో ఉండడం సరైనది కాదన్నారు. మతాన్ని రాజకీయాలకు వేదికగా వాడుకోవడం బాధాకరమన్నారు. అసలు ఏ గ్రంథంలోనూ హిందూమతం లేదని, లేని మతాన్ని అందరికీ ఆపాదిస్తూ విషపూరితమైన ‘విద్వేషాన్ని’ పాలకులు నింపుతున్నారని తెలిపారు. టిటిడి ‘బైలా’లోనే ఆడపిల్లలకు చదువు నేర్పించాలని, ఉచిత వైద్యం అందించాలని, బలహీనులకు సేవచేయడమే అత్యున్నత సేవని, మానవసేవే దైవసేవని చెబుతున్నా, పెత్తనం చేయాలనుకున్నవారు ‘మనుధర్మశాస్త్రం’ పేరు చెప్పి పుట్టుక పేరుతో కులాలు సృష్టించారన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం మెరుగుపడేలా జీర్ణోద్ధరణ నిధులు కేటాయించాలని దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బంగారు మురళి మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వామి సన్నిధిలో 32 రకాల కళలను ప్రదర్శిస్తున్నామని, అయితే శ్రీవారి ఎదుట మన కళను ప్రదర్శించాలంటే ‘డిక్లరేషన్‌’ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆంక్షలు లేకుండా కళాకారులందరికీ ప్రదర్శనలు ఇచ్చేలా అవకాశం ఇస్తూ, దర్శన సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సదస్సులో అన్నపూర్ణస్వామి ఆశ్రమ నిర్వాహకులు ఆంజనేయస్వామి, కాకినాడ నూకరాజ్‌, గోవింద పిరమిడ్‌ వ్యవస్థాపకులు భాస్కర్‌, జయభారత్‌ సంస్థ నిర్వాహకులు కళావతి, రాష్ట్ర నలుమూలల నుంచి కళాబృందాల గురువులు పాల్గొన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని టిటిడి ఇఒ శ్యామలరావుకు అందజేశారు.

➡️