పిడుగుపాటుకు భార్యాభర్తలు మృతి 

ప్రజాశక్తి – గోరంట్ల (శ్రీసత్యసాయి జిల్లా) : పిడుగుపాటుకు గురై భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరంట్ల మండలంలోని దిగువ గంగంపల్లికి చెందిన దశరథ నాయక్‌ (50), ఆయన భార్య దేవి బారు (45) తమకు చెందిన పాడి ఆవుల నుంచి పాలు పితకడానికి తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమ ఇంటి పక్కనే ఉన్న షెడ్డులోకి వెళ్లారు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వారు ఉన్నచోట పిడుగు పడటంతో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే ఉన్న రెండు పాడి ఆవులు మృతి చెందాయి. అదే షెడ్డులో నిద్రిస్తున్న దశరథ నాయక్‌ కుమారుడు జగదీష్‌ నాయక్‌కు తీవ్ర గాయాలు కావడంతో సమీప బంధువులు ఆయనను పుట్టపర్తి ఆస్పత్రికి తరలించారు. సిఐ శేఖర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేస్తున్నారు.

➡️