ప్రేమ పెళ్లి – నిండు గర్భిణిని గొంతునులిమి చంపిన భర్త

విశాఖపట్నం : ప్రేమించి పెళ్లి చేసుకొని నిండు నెలల గర్భిణిగా ఉన్న భార్యను గొంతు నులిమి భర్త హతమార్చిన ఘటన విశాఖలోని మధురవాడలో జరిగింది. దువ్వాడకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వర్‌ (28), అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన కేదారిశెట్టి అనూష (27) 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జ్ఞానేశ్వర్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో పనిచేస్తూ స్కూళ్లలో ట్రైనింగ్‌ ఇస్తుంటాడు. ఏడాది క్రితం దంపతులు మధురవాడకు వచ్చారు. మిథిలాపురి వుడాకాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. వివాహమై మూడేండ్లు అవుతున్నా … భార్యను ఇంతవరకు అతడి తల్లిదండ్రులకు పరిచయం చేయలేదు. వివాహం జరిగిన విషయాన్ని కూడా వారితో చెప్పలేదు. అత్తమామల వద్దకు వెళదామని భార్య ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వస్తున్నాడు. ఓసారి తనకు క్యాన్సర్‌ వచ్చిందని, విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలని భార్యను మోసగించే ప్రయత్నం చేశాడు. ” నీతోనే జీవితం ” అని ఆమె అతడితో తెగేసి చెప్పేయడంతో వారి మధ్య తరచుగా మాటల యుద్ధం జరిగేది. గర్భిణిగా ఉన్న అనూషకు నెలలు నిండగా సోమవారం ఆసుపత్రిలో చేరాల్సి ఉంది. దీంతో అనూషకు కాన్పు నిమిత్తం.. ఆమె అమ్మమ్మ రెండు రోజుల క్రితం వారి ఇంటికి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు బెడ్‌రూమ్‌లో కూర్చున్నాడు. అనూషను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సమయం అవుతుండటంతో అమ్మమ్మ ఆమెను పిలిచింది. ఎంతకూ లేవకపోవడంతో కంగారుపడి జ్ఞానేశ్వర్‌ను పిలిచింది. అతడు ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి పట్టణంలోని ఓ దవాఖానకు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మఅతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో అనుమానించిన అనూష తనను మానసింగా హింసిస్తున్నదని, విసుగుచెంది గొంతు నులిమి చంపేశానని జ్ఞానేశ్వర్‌ అంగీకరించాడని వెల్లడించారు. నిందితుడి అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

➡️