ప్రభుత్వ భూములు గుర్తించండి

  • మహిళా సంఘాల ‘సోలార్‌’కు ఏర్పాట్లు చేయండి
  • కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సిఎం భట్టి ఆదేశాలు

ప్రజాశక్తి – హైదరాబాద్‌బ్యూరో : మహిళా స్వయం సమృద్ధి సంఘాల (ఎస్‌హెచ్‌జి)కు కేటాయించిన వెయ్యి మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములను గుర్తించాలని డిప్యూటీ సిఎం, ఆర్థిక, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఒక మెగావాట్‌ సోలార్‌ విద్యుదుత్పత్తికి నాలుగు ఎకరాల భూమి అవసరమనీ, ప్రతిజిల్లాలో కనీసం 150 ఎకరాలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 వేల ఎకరాలను సేకరించాలని చెప్పారు. ఎస్‌హెచ్‌జిల గుర్తింపు, టెండర్ల ఖరారు, బ్యాంకు రుణాలు వంటి అన్ని కార్యకలాపాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారంనాడాయన ప్రజాభవన్‌ నుంచి మంత్రులు దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్‌హెచ్‌జిలకు సోలార్‌ పవర్‌ ప్లాంట్ల కేటాయింపుపై ఇప్పటికే ఇంథనశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య గత ఏడాది నవంబర్‌ 19న ఒప్పందం కుదిరిందనీ, దాన్ని వెంటనే అమల్లోకి తేవాలని చెప్పారు. మహిళా సంఘాలకు సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీనికోసం టీజీరెడ్కో సంస్థ ఇప్పటికే టెండర్లు పిలిచిందనీ, త్వరలో వాటిని ఓపెన్‌ చేసి, ఖరారు చేస్తామన్నారు. ప్రధానంగా దేవాదాయ, ఇరిగేషన్‌ శాఖల ఆధీనంలోని భూములను గుర్తించాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయా భూముల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని డిప్యూటీ సీఎం సూచించారు. సోలార్‌ విద్యుత్‌ అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాల్లోని రైతులు డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. అటవీ హక్కుల ద్వారా లభించిన భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. రాష్ట్రంలో 6.67 లక్షల ఎకరాలను ఇప్పటివరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయగా, ఆ భూముల్లో లాభసాటి పంటల సాగు జరగడంలేదని వివరించారు. ఇకనుంచి ఆ భూముల్లో ఉపాధి హామీ, గిరిజన శాఖ, స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే పథకాలన్నింటినీ సమన్వయం చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం కలిగించే పంటల సాగును ప్రోత్సహించేలా గిరిజన శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో భారీ భవంతుల పైన సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గుట్టలతో విస్తరించిన భూములు అత్యధికంగా ఉన్నాయనీ, వాటి పైన సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్రంలోని పీఎమ్‌ కుసుమ్‌ పథకంలో భాగంగా రైతులు రెండు మెగావాట్ల వరకు సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఏర్పడిందనీ, ఆ దిశగా వారిని చైతన్యం చేయాలని చెప్పారు. టీజీ రెడ్కో పోర్టల్‌ ద్వారా రైతులు సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజనులకు భూమి లభ్యత ఎక్కువగా ఉన్నా, ఆదాయం తక్కువగా వస్తున్నదనీ, అందువల్ల అచ్చంపేట నుంచి ఆదిలాబాద్‌ వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో భూములపై అధికారులు ప్రత్యేక దృష్టిపెడితే వారికి ప్రయోజనం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ లోకేష్‌, సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ కృష్ణ భాస్కర్‌, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

➡️