కమీషన్లు అడిగితే అధికారుల దృష్టికి తేవాలి

Nov 27,2024 23:45
  • ఎస్‌ఎల్‌బిసి సీనియర్‌ మేనేజరు గౌతమ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వయం సహాయక గ్రూపుల సభ్యులకు అవసరమైన రుణాలివ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ఎస్‌ఎల్‌బిసి సీనియర్‌ మేనేజరు గౌతమ్‌ పేర్కొన్నారు. రుణాల మంజూరుకు ఎవరికీ ఎలాంటి కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎవరైనా కమీషన్లు అడిగితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. వడ్డేశ్వరంలో బుధవారం స్వయం సహాయక రాష్ట్ర సమన్వయ కమిటీ సిహెచ్‌ రమణి అధ్యక్షతన జరిగింది. సభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు గురించి చర్చిస్తామని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారా రుణాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టే పద్దతులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు గౌతమ్‌ తెలిపారు. లోన్‌ సమయంలో బలవంతపు ఇన్స్యూరెన్స్‌, పిక్స్‌డ్‌ డిపాజిట్లకు వత్తిడి తేవడం సబబు కాదన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపుల్లో కోట్లాదిరూపాయల అవినీతి జరుగుతోందన్నారు. అవినీతిలో భాగస్వామ్యులవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలన్నారు. అంతర్గత రుణాలను ఉపయోగించుకుని మినీ బ్యాంక్‌ మాదిరిగా నిర్వహించుకునేందుకు నైపుణ్యాన్ని సంపాదించా లన్నారు. రుణాల మంజూరు సందర్భంగా రూ.20 లక్షల వరకు లోన్లు మంజూరు చేయడం మాత్రం సరిపోదని వారికి ప్రాసెసింగ్‌ చార్జీలు మొత్తం రద్దు చేయాలన్నారు. డ్వాక్రా ద్వారా ఆర్ధిక సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. పొదుపు సొమ్మునుంచి ఇంటర్నల్‌ లెండింగ్‌ ద్వారా వడ్డీ దోపిడీ నుంచి బయటపడవచ్చన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ మహిళలు పురోగతి సాధించాలంటే డ్వాక్రా మహిళలంతా ఐకమత్యంగా ఉండాలన్నారు. మహిళలపై జరుగుతున్న హింస, మద్యం, గంజాయి సమస్యలపై కూడా ఆలోచనలు కలబోసుకుని కలిసి పనిచేద్దామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ”రీటా నేర్పిన పాఠం” పుస్తకాన్ని గౌతమ్‌కు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసకుమారి, ఐద్వా రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ శ్రీదేవి, పూర్ణ, వై.సత్యవతి, పద్మ పాల్గొన్నారు.

➡️