మారకపోతే …మారుస్తాం..!

Jan 8,2025 22:35
  • ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్‌

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : ‘టిడిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడని బాధ్యత మన అందరిపై ఉంది. రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు. ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు పనిలో లేరని నా దగ్గర లెక్కలున్నాయి. మీరు మారండి.. ప్రజల్లోకి వెళ్లండి… మారకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మొహమాటంగా ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం వచ్చిన చంద్రబాబు తొలిరోజు ‘స్వర్ణకుప్పం విజన్‌ 2029’ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అదేరోజు రాత్రి కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా నియోజకవర్గంలో ఎంతమాత్రం పట్టు సాధించారనే విషయమై చంద్రబాబు సమీక్షించారు. ప్రజలకు ఉపయోగపడేలా ఏయే కార్యక్రమాలు చేశారని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. మీ పనిపై తాను జరిపిన సర్వేలో సంతృప్తి లేదన్నారు. ఇకనైనా మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించినా ఆశాభంగమే కలుగుతుందని సూచనప్రాయంగా చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. తిరుపతి జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరికి చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది.

సిఎంకు కృతజ్ఞతలు తెలిపిన రైతు

వ్యవసాయ బోరుకు పంప్‌సెట్‌ కావాలని శాంతిపురం మండలం సోమాపురం గ్రామానికి చెందిన రైతు సి.చలపతి సిఎంకు మంగళవారం అర్జీ ఇచ్చారు. సిఎం ఆదేశాల మేరకు అదేరోజు సాయంత్రం రైతు పొలంలో వ్యవసాయ బోరుకు 10హెచ్‌పి /30 పంపుసెట్‌ ఏర్పాటు చేసి ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ అధికారులు నీరు అందించారు. బుధవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ముఖ్యమంత్రిని లబ్దిదారుడు చలపతి కలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘రూ.80 వేలు అప్పుచేసి పొలంలో బోరు వేశాను. డబ్బు సరిపోక పంప్‌సెట్‌ వేయించలేకపోయాను. పంట మొత్తం ఎండిపోయింది. ఈనెల ఏడో తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కుప్పంలో అర్జీ సమర్పించాను. సిఎం ఆదేశాలతో అధికారులు అదేరోజు సాయంకాలం పంపుసెట్‌ బిగించి పొలానికి నీరు అందించారు. నా ఆనందాన్ని అవధుల్లేవని, సిఎం చంద్రబాబు తనపాలిట దేవుడు’ అని అభిమానాన్ని చాటుకున్నారు.

➡️