హైదరాబాద్: హిమాయత్ సాగర్‌లోని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి గెస్ట్ హౌస్ పై కేటీఆర్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గెస్ట్ హౌస్ నిర్మించుకున్నానని ఆయన తెలిపారు. చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాల కూల్చివేతను సమర్థిస్తున్నట్టు మహేందర్‌రెడ్డి తెలిపారు. ”ఎలాంటి చెరువు భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించలేదు. నిబంధనల ప్రకారం లేదని తేలితే నేనే కూల్చివేస్తాను. 111 జీవో పరిధిలో చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం అనుమతిస్తేనే నిర్మించుకున్నాం. నా గెస్ట్ హౌస్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటే కూల్చేయమని చెప్తున్నా. పట్టాభూమిలోనే నా గెస్ట్ హౌస్ ఉంది. అక్కడికి దగ్గర్లోనే చాలా ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడారని భావిస్తున్నా” అని చెప్పారు.
