ఉక్కు కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగిస్తే ఊరుకోం

– స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1459వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కుట్రలతో ప్లాంట్‌లోని కాంట్రాక్టు కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయన్నారు. 30 ఏళ్ల నుంచి కర్మాగారంలో పర్మినెంట్‌ కార్మికులతో కలిసి కాంట్రాక్టు కార్మికులు ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉక్కు కర్మాగారం ప్రగతిలో వీరి పాత్ర కీలకమైందన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను ప్లాంట్‌లో తొలగించేందుకు నిర్ణయం జరగ్గా పెద్ద ఎత్తున పోరాటం చేసి అడ్డుకున్నామని తెలిపారు. ఇప్పుడు దొడ్డిదారిన మళ్లీ తొలగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పోరాటాలతో కేంద్ర ప్రభుత్వ, ఉక్కు యాజమాన్య కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. దీక్షల్లో సంఘం నాయకులు ఎన్‌.కృష్ణ, శశిభూషణం, సింహాచలం, అప్పలరాజు, జి.సతీష్‌, రాము, ఎం.సన్యాసిరావు పాల్గొన్నారు.

➡️