కేంద్రం పట్ల టిడిపి, జనసేనవైఖరి మారాలి

  • సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి
  • వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో బిజెపికి ప్రత్యామ్నాయం
  • నెల్లూరులో ఉత్తేజపూరితంగా ప్రారంభమైన సిపిఎం రాష్ట్ర 27వ మహాసభ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు) : రాష్ట్రాల హక్కులపై దాడికి ఒడిగడుతున్న కేంద్ర ప్రభుత్వం పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీల వైఖరి మారాలని ఇక్కడ జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభ ప్రారంభ సభలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి అన్నారు. దేశంలో, రాష్ట్రంలో విస్తరిస్తున్న బిజెపి మతోన్మాదానికి లౌకిక, ప్రజాతంత్ర శక్తులే ప్రత్యామ్నాయమని చెప్పారు. మూడు రోజులపాటు జరిగే సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ 27వ మహాసభ శనివారం ఉత్తేజపూరితంగా ప్రారంభ మైంది. పార్టీ సీనియర్‌ నాయకులు పెనుమల్లి మధు పార్టీ జెండా ఆవిష్కరించారు. మహాసభ నిర్వహిస్తున్న ప్రాంగణానికి కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌గా పేర్కొన్నారు. ప్రారంభ సభకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ అధ్యక్షత వహించారు. ఎంఎ బేబి మహాసభ ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై టిడిపి, జనసేన వైఖరేంటి? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని యూనివర్శిటీలకు వైస్‌ చాన్సలర్ల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పని లేకుండా నేరుగా గవర్నర్లు చేపట్టేలా యుజిసి మార్గదర్శకాలిచ్చింది. ఆ విధంగా కేంద్రం చట్టం చేస్తే రాష్ట్రాలకు తమ నిధులతో నడిచే వర్శిటీలపై అధికారం ఉండదు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే దుర్మార్గ విధానాలపై టిడిపి, జనసేన ఏం చెబుతాయి?… అని బేబి చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రాలన్నీ కలిపి 60 శాతం నిధులు ఖర్చు చేస్తుండగా, కేంద్రం 40 శాతమే ఖర్చు చేస్తోంది. వనరుల పంపిణీలో అది రివర్స్‌గా ఉంది. వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రాలకు 40 శాతం ఇచ్చి, కేంద్రం 60 శాతం ఊడగొడుతోంది. మోడీ సర్కారు డర్టీ ట్రిక్‌ ఎంచుకుంది. రాష్ట్రాలకు నిధులు కేటాయించే ఆర్థిక సంఘం పరిధికి వెలుపల సర్‌ఛార్జీలు, సెస్‌లను మోదుతోంది. దేశం అభివృద్ధి చెందుతోందని మోడీ సర్కారు ఊదరగొడుతుండగా టిడిపి, జనసేన వంత పాడుతున్నాయి. మరి ఆకలి సూచిలో భారత్‌ అట్టడుగున ఉంది. దీనిపై ఆ రెండు పార్టీలూ స్పందించవా? ఎనిమిదేళ్లలో లక్షా 474 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రోజుకు 34 బలవన్మరణాలు. ఆత్మహత్యలకు కారణం బిజెపి సర్కారు. ఆత్మహత్యలను ప్రేరేపించడం నేరం. మోడీ, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌ శిక్షార్హులే…

తక్కువ అంచనా వేయొద్దు

ఎన్నికల్లో 400 పైన సీట్లు సాధించి మెజార్టీ మతతత్వ రాజ్యాన్ని ఏర్పర్చేందుకు బిజెపి ఆత్ర పడగా, అప్రమత్తమైన ప్రజలు ఆ పార్టీకి సాధారణ మెజార్టీ సైతం ఇవ్వకుండా వెనక్కికొట్టారని ఎంఎ బేబి గుర్తు చేశారు… అంతమాత్రాన బిజెపిని తక్కువ అంచనా వేయొద్దు. తాము తేవాలనుకున్న చట్టాల కోసం పెద్ద సంఖ్యలో ఎంపిలను సస్పెండ్‌ చేసింది. ఎన్‌డిఎ ప్రభుత్వం ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో పని చేస్తోంది. మెజార్టీ మతోన్మాదాన్ని అంతకంతకూ విస్తరిస్తోంది. బిజెపిని ఎన్నికల్లో ఓడించడంతోనే సరిపోదు. సైద్ధాంతికంగా, సాంస్కృ తికంగా అత్యంత సమర్ధవంతంగా నిలువరించాలి. అందుకోసం లౌకిక, ప్రజాతంత్ర శక్తులను మరింత బలంగా సమీకరించాలి. బడ్జెట్‌ ప్రజలకు అనుకూల ంగా ఏమీ ఉండదు. కార్పొరేట్లకు, శతకోటీశ్వరులకు అనుకూలంగా ఉంటుంది. ఇది ముందుగా ఊహించిందే. పదేళ్లుగా ఇదే జరుగుతోంది. బిజెపి ప్రభుత్వానిది మూడు ‘ఎం’లు, మూడు ‘సి’ల పాలన. మూడు ‘ఎం’ అంటే… మనీ, మజిల్‌ పవర్‌, మీడియా దుర్వినియోగం. మూడు ‘సి’ అంటే… కమ్యూనలిజం, క్యాస్ట్‌-సబ్‌ క్యాస్ట్‌, సెంట్రల్‌ ఏజెన్సీల దుర్వినియోగం. బిజెపి సర్కారు ఎన్నికల్లో ఓడిపోయినా డబ్బుతో పార్టీలను, ప్రజాప్రతినిధులను కొని అడ్డదారిలో అధికారం నిలబెట్టుకుంటోంది. అవసరమైతే పార్టీలను చీల్చడం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది….

సహజసిద్ధ లక్షణం

ఆర్థిక సర్వేలో గణాంకాలతో ఎంతగా అభివృద్ది, జిడిపిలపై ఎక్కువ చేసి చూపినా రేఖామాత్రంగానైనా కొన్ని వాస్తవాలు వెల్లడయ్యాయని ఎంఎ బేబి గుర్తు చేశారు… ఉద్యోగులకు పని గంటలు పెంచితే వారు మానసికంగా ఇబ్బంది పడతారని, పనిగంటలు పెంచాలన్న కార్పొరేట్ల ప్రతిపాదనలపై హెచ్చరించింది. డాలర్‌తో మారకంలో రూపాయి విలువ దిగజారడంతో పెట్టుబడులు దేశం నుంచి తరలిపోతున్నాయని సర్వే పేర్కొంది. మోడీ 2014లో డాలర్‌తో మారకాన్ని 40 రూపాయల వద్ద ఉంచుతామనగా, ప్రస్తుతం అది రెట్టింపయింది. పెట్టుబడిదారీ విధానంలో ఆర్థిక సంక్షోభం సహజసిద్ధంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది… అని పేర్కొన్నారు. ప్రపంచంలో మితవాద శక్తులు కొన్ని దేశాల్లో అధికారంలోకి రాగా ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని కొన్ని దేశాల్లో వామపక్ష, అభ్యుదయ పార్టీలు అధికారంలోకొచ్చాయని వివరించారు. ఏప్రిల్‌లో జరిగే పార్టీ అఖిల భారత మహాసభకు రాష్ట్ర మహాసభ సన్నాహకమన్నారు. ఉద్యమం బలహీనపడిందని గుర్తించామని, పరిస్థితిని అధిగమించి కొత్త సమస్యల పరిష్కారానికి ప్రజలదగ్గరకెళ్లి తెలుసుకొని, బిజెపి మతతత్వ, కార్పొరేట్‌ విధానాలను ఎదుర్కొనే కార్యాచరణ రూపకల్పనపై మహాసభలో చర్చిస్తామన్నారు. ఒక్క కమ్యూనిస్టు పార్టీలోనే శాఖ నుంచి కేంద్ర కమిటీ వరకు రాజకీయ తీర్మానం, ఎత్తుగడల పంథాపై చర్చ జరుగుతుందని తెలిపారు.

పోరాటాల నేల

తెలుగు నేలకు కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర ఉందన్నారు. ఇక్కడ జరగిన వీర తెలంగాణ రైతాంగ పోరాటం దేశానికి ఉత్తేజాన్నిచ్చిందన్నారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు ప్రాంతం వారేనని, ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని చెప్పారు. మాకినేని బసవపున్నయ్య, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో ఉద్యమ నిర్మాతలు తెలుగుగడ్డపై నుంచే వచ్చారని, వారందరినీ విప్లవ జోహార్లతో స్మరించుకోవాలని, వారి పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలని బేబి అన్నారు. మహాసభ ప్రారంభ సభా వేదికపైకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆహ్వానితులకు స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు సంతాపతీర్మానం ప్రవేశపెట్టగా మహాసభ ఆమోదించింది. సభా వేదికపై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ పుణ్యవతి, బి వెంకట్‌, ఆర్‌ అరుణ్‌ కుమార్‌, మహాసభ ఆహ్వానసంఘం గౌరవాధ్యక్షులు విఠపు బాలసుబ్రమణ్యం, అధ్యక్షులు డాక్టర్‌ మాదాల వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు.

➡️