- లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
- ఉండి నియోజకవర్గంలో విధ్వంస, అరాచక పాలన
- డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామకృష్ణరాజు అనర్హుడు: వి శ్రీనివాసరావు
- పాలకోడేరు బాధితులకు సిపిఎం నేతల పరామర్శ
ప్రజాశక్తి- భీమవరం : కూల్చేసిన పేదల ఇళ్లను నెల రోజుల్లో పునర్నిర్మించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉండి నియోజకవర్గంలో విధ్వంస, అరాచక పాలన రాజ్యమేలుతోందని, మూడు నెలల కాలంలో సుమారు వెయ్యి ఇళ్లు కూల్చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. పేదలపై యుద్ధం చేస్తోన్న డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఆ పదవికి అనర్హుడని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులోని ఎఎస్‌ఆర్ నగర్‌ను సిపిఎం రాష్ట్ర నేతలు బి.బలరాం, మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్, వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణతో కలిసి శ్రీనివాసరావు మంగళవారం సందర్శించారు. అధికారులు ఇటీవల కూల్చేసిన ఇళ్లను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమ కష్టాలు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. పడగొట్టిన ప్రతి ఇంటినీ, భూస్వాములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని, ప్రభుత్వ సర్వే రాళ్లను నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఎస్‌ఆర్ నగర్‌లో బాధితులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్ అధ్యక్షత వహించారు. ఈ సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎఎస్‌ఆర్ నగర్‌లోని ఇళ్ల శిథిలాలను చూస్తుంటే హృదయం చలించిపోతోందన్నారు. చంద్రబాబు పుట్టిన రోజున జరిగిన ఈ ఘటనను ముఖ్యమంత్రి బహుమతిగా స్వీకరిస్తారా,్ణ? తిరస్కరిస్తారా? అని ప్రశ్నించారు. స్థానిక ఎంఎల్‌ఎ రఘురామకృష్ణరాజు చేసిన పాపంలో కలెక్టర్ నుంచి తహశీల్దార్ వరకు అధికారులందరూ భాగస్తులేనన్నారు. ప్రభుత్వ భూముల్లో పేదలు ఇళ్లు వేసుకుంటే తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. మహిళలను మగ పోలీసులు కొడతారా, సిగ్గుందా అని ప్రశ్నించారు. పాలకోడేరు పోలీసులపై మానవ హక్కుల సంఘాలకు నివేదిస్తామని హెచ్చరించారు. పునరావాసం కల్పించకుండా ఇళ్లు తొలగించడం నేరమన్నారు. కాలుష్యం పేరుతో ఇళ్లను తొలగిస్తున్నారని, ఆక్వా ప్లాంట్లు, యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యం మీకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. ఐక్యంగా పోరాడదామని, మీకు ఎర్రజెండా అండగా నిలుస్తుందని బాధితులకు ధైర్యం చెప్పారు. బ్యాంకులకు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి డిఫాల్ట్ అయిన, సిబిఐ కేసులున్న రఘురామకృష్ణరాజు ఇప్పుడు నీతులు చెబుతున్నారని వి.శ్రీనివాసరావు విమర్శించారు. 2019 నుంచి ఎన్ని కేసులున్నాయో వాటన్నింటికీ సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్లోనే కేసుల భాగోతం ఉందన్నారు. హిందూ భారత్ విద్యుత్ కంపెనీలో నష్టమొచ్చిందనే పేరుతో రూ.600 కోట్లు ఎగ్గొట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే రఘురామకృష్ణాంజు అవినీతిని, ఎగ్గొట్టిన బకాయిలను బయట పెట్టాలన్నారు. ఉండి నియోజకవర్గంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌లకు కన్పించడం లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో డబ్బులు పంచానని రఘురామకృష్ణాంజు బహిరంగంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. డిప్యూటీ స్పీకర్ అరాచకాలను కట్టడి చేయకపోతే టిడిపి కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు.
భూస్వాముల ఆక్రమణలోని భూమిని పేదలకు పంచుతాం
ఎఎస్‌ఆర్ నగర్‌లో భూస్వాముల కబ్జాలో ఉన్న భూమిని ప్రభుత్వం నెల రోజుల్లో స్వాధీనం చేసుకోని పేదలకు పంచాలని డమాండ్ చేశారు. లేనిపక్షంలో తామే ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని హెచ్చరించారు. సుమారు రెండు ఎకరాల్లో సెంటు, సెంటున్నర భూమిలో నిరుపేదలు ఇళ్లు నిర్మించుకొని 40 ఏళ్ల నుంచి జీవిస్తుంటే కాలువ కలుషితం పేరుతో వాటిని కూల్చారని, భూస్వాముల కబ్జాలో ఉన్న సుమారు 13 ఎకరాల భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. దడాల సుబ్బారావు మాట్లాడుతూ పేదల గుడిసెలు మాత్రమే అధికారులకు, ఎంఎల్‌ఎకు కనిపించాయా? భూస్వాముల కబ్జాలోని భూములు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి-4… ఉండి నియోజకవర్గంలో రివర్స్‌లో అమలవుతోందన్నారు. సంపన్నుల సహకారంతో పేదలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చెబుతుంటుంటే, ఇక్కడ మాత్రం పేదలను కొట్టి సంపన్నులకు ఆస్తులను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.