- మండలిలో పయ్యావుల కేశవ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న మిట్టల్ స్టీల్ కంపెనీకి సమస్య వస్తే దాన్ని రాష్ట్ర సమస్యగా భావించి తక్షణమే పరిష్కరించామని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దావోస్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సు-2025 సందర్భంగా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల వివరాల గురించి వైసిపి సభ్యులు టి మాధవరావు, పండుల రవీంద్రబాబు, కె శ్రీనివాస్ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో గురువారం అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ మిట్టల్ స్టీల కంపెనీకి వచ్చిన ఆ ఒక్క సమస్యనే కాకుండా, ఇతర అన్ని సమస్యలను కూడా పరిష్కరించినట్లు తెలిపారు. ఒడిషాలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మిట్టల్ కంపెనీ ప్రయత్నిందని, తాము ఆ కంపెనీతో చర్చలు జరిపి రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలను తరిమికొట్టారని తెలిపారు. లూలు మాల్, అమర్ రాజా ఫ్యాక్టరీలను పక్క రాష్ట్రాలకు తరిమికొట్టారని విమర్శించారు. ఒక్క ఫోన్ కాల్‌తో అమర్ రాజా రాష్ట్రం నుంచి తరలిపోయిందన్నారు. శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో ప్రధాన మంత్రి ప్రారంభించిన కంపెనీ పనులన్ని తమ ప్రభుత్వంలో పూర్తిచేశామన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో జిందాల్ కంపెనీని తరిమేశారని విమర్శించారు. మహారాష్ట్రలో ఆ కంపెనీ రూ.3లక్షల కోట్లతో ఎంవోయు చేసుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వంపై నింద వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అమర్ రాజాను తాము తరిమేసినట్లు ఆ కంపెనీ నుంచి చెప్పించగలరా అని ప్రశ్నించారు. మంత్రి పయ్యావుల మాట్లాడుతూ రైల్వే జోన్‌కు భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు. బొత్స స్పందిస్తూ రైల్వే జోన్ భూమికి తాము అనుమతి ఇచ్చామని, దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య కొంతసేపు వాగ్యువాద్ధం చోటుచేసుకుంది. ఈ అంశంపై మరోసారి చర్చ జరపాలని పయ్యావుల మండలి చైర్మన్ కె మోషేనురాజును కోరారు.