పెండింగ్‌ సమస్యలను పరిష్కరించకపోతే 14నుంచి ఉద్యమబాట

Feb 12,2024 11:06 #AP Jac, #poster avishkarana
  • 27న చలో విజయవాడ
  • స్పందించకపోతే మెరుపు సమ్మె
  • ఎపిజెఎసి వెల్లడి
  • రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై ఈనెల 12న ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశంలో ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా నిర్ణయాలు రాకపోతే ఉద్యమ బాట పట్టనున్నట్లు ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్‌ జి.హృదయరాజు తెలిపారు. విజయవాడ గాంధీనగర్‌ ఎపి ఎన్‌జిఓ భవన్‌లో ఆదివారం ఎపి జెఎసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. అనంతరం బండి శ్రీనివాసరావు, హృదయరాజు మీడియాతో మాట్లాడుతూ 13లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఈనెల 14న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడంతోపాటు తహశీల్దార్‌, సబ్‌కలెక్టర్‌, కలెక్టర్లకు మెమోరాండమ్‌లు ఇవ్వడం, 15, 16 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నియోజకవర్గ స్థాయిలో పాఠశాలల్లో నిరసనలు, 17న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం చేయాలని నిర్ణయించారు. 20న జిల్లా కేంద్రాల్లో (కలెక్టరేట్ల వద్ద) ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని, 21 నుంచి 24 వరకు అన్ని జిల్లా కేంద్రాల పర్యటనలు చేయాలని, 27న చలో విజయవాడ నిర్వహించాలని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మెరుపు సమ్మెకు దిగాలని ఎపి జెఎసి విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 12వ పిఆర్‌సిలో మధ్యంతర భృతి (ఐఆర్‌) 30శాతం తక్షణమే చెల్లించాలని, పెండింగ్‌లోని రెండు కొత్త డిఎలు (01.01.2023, 01.07.2023) తక్షణమే విడుదల చేయడంతోపాటు సిపిఎస్‌ వారి డిఎలు 90శాతం క్యాష్‌ రూపంలోనివి చెల్లించాలని కోరారు. పిఎఫ్‌, ఎపి జిఎల్‌ఐ లోన్స్‌, క్లైమ్స్‌, 11వ పిఆర్‌సి, డిఎ, సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, మెడికల్‌ రీ ఎంబర్స్‌మెంట్‌ బిల్స్‌ బకాయిలు చెల్లించాలని, 01.09.2024కు ముందు నోటిఫై అయి అనంతరం నియామకమైన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఓపిఎస్‌) అమలు చేయాలని ఎపి జెఎసి డిమాండ్‌ చేసింది. పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 70 – 75 ఏళ్లమధ్య వయసు వారికి 10శాతం, 75-80 ఏళ్ల వారికి 15శాతం మంజూరు చేయాలని కోరారు. టీచర్లకు అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలని, జీఓ నెంబరు 117ను రద్దు చేయాలని, సిపిఎస్‌/జిపిఎస్‌లను రద్దు చేసి ఓపిఎస్‌ అమలు చేయాలని బండి శ్రీనివాసరావు, జి.హృదయరాజు డిమాండ్‌ చేశారు. వీటితో పాటు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచనున్నట్లు వారు వెల్లడించారు.

➡️